ముంబై–దుబాయ్ సైబర్ ముఠా బట్టబయలు
₹1000 కోట్ల డిజిటల్ స్కామ్‌ను రట్టు చేసిన బెంగళూరు పోలీసులు
బెంగళూరులో నమోదైన ఒక సాధారణ సైబర్ కంప్లెయింట్ దేశ చరిత్రలోనే అతిపెద్ద డిజిటల్ మోసాల్లో ఒకదాన్ని బయటపెట్టింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో వేలాది మందిని మోసం చేసి సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ప్రజల సొమ్మును కొల్లగొట్టిన అంతర్జాతీయ సైబర్ ముఠాను బెంగళూరు హుళిమావు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేయగా, దాదాపు 4,500 బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.240 కోట్లను ఫ్రీజ్ చేశారు.
కుట్రకు కేంద్రం.. ముంబై నుంచి దుబాయ్ వరకు
ఈ భారీ నెట్‌వర్క్‌కు మాస్టర్‌మైండ్‌గా పోలీసులు 55 ఏళ్ల ప్రేమ్ తనేజాను గుర్తించారు. ముంబైకి చెందిన ఇతను గతంలో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న ప్రేమ్ తనేజా అక్కడి నుంచే ఈ అంతర్జాతీయ సైబర్ స్కామ్‌ను నియంత్రిస్తున్నాడు. ఢిల్లీలోని ఓ అపార్ట్‌మెంట్‌ను ఆఫీసుగా మార్చి, అక్కడి నుంచే దేశవ్యాప్తంగా అమాయకులను టార్గెట్ చేసేవారు.
స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు, ఆన్‌లైన్ జాబ్స్ పేరుతో ప్రజలను ఆకర్షించేందుకు ‘Swamiji.com’, ‘Neo System App’ వంటి నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లను వాడేవారు. టెలిగ్రామ్ గ్రూపులు, సోషల్ మీడియా ద్వారా బాధితులకు గాలం వేసి, మొదట చిన్న మొత్తాలపై లాభాలు చూపించి నమ్మకం పెంచేవారు. ఒకసారి నమ్మకం ఏర్పడిన తర్వాత పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టేలా చేసి డబ్బంతా కాజేసేవారు.
డ్రాపౌట్ విద్యార్థి.. స్కామ్‌కు కీలక సూత్రధారి
ఈ కేసులో అరెస్ట్ అయిన 22 ఏళ్ల మొహమ్మద్ హుజైఫా పాత్ర కీలకంగా ఉంది. చదువు మధ్యలోనే మానేసిన హుజైఫాకు టెక్నాలజీ, ఆన్‌లైన్ గేమింగ్, హ్యాకింగ్‌పై అపారమైన పట్టు ఉంది. గతంలో ప్రేమ్ తనేజాకు చెందిన యాప్‌ను రెండు సార్లు హ్యాక్ చేసిన హుజైఫా టాలెంట్‌ను గమనించిన తనేజా.. అతనిపై కేసు పెట్టకుండా తన నెట్‌వర్క్‌లోకి తీసుకున్నాడు.
అప్పటి నుంచి హుజైఫా ముఠాలో కీలక పాత్ర పోషిస్తూ ‘మ్యూల్ అకౌంట్స్’ ఏర్పాటు చేయడంలో నిపుణుడిగా మారాడు. ఇతను ప్రతి 15 రోజులకు ఒకసారి దుబాయ్ వెళ్లి మోసం చేసిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చేవాడు. ఈ పనికి గాను అతనికి నెలకు రూ.30 నుంచి రూ.35 లక్షల వరకు కమిషన్ అందేదని పోలీసులు వెల్లడించారు.
కూలీల పేరుతో వేల ఖాతాలు.. అద్దె అకౌంట్ల దందా
పోలీసుల కళ్లుగప్పేందుకు సైబర్ నేరగాళ్లు ‘అద్దె అకౌంట్స్’ను వినియోగించేవారు. హుజైఫా తన తల్లి షబానాతో కలిసి అమాయక కూలీలను డబ్బులు ఆశ చూపి వలలో వేసి, వారి ఆధార్ కార్డులతో వేల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లను తెరవించాడు. ఈ ఖాతాల ద్వారానే స్కామ్ ద్వారా వచ్చిన డబ్బును మళ్లించేవారు. హుజైఫా ఒక్కడే సుమారు 7,500కు పైగా అకౌంట్లను స్కామర్లకు అందించినట్లు దర్యాప్తులో తేలింది.
శాటిలైట్ ఫోన్లు.. ట్రేస్ కాని కమ్యూనికేషన్
తమ కార్యకలాపాలు బయటపడకుండా ఉండేందుకు ఈ ముఠా అత్యాధునిక పద్ధతులను ఉపయోగించింది. దుబాయ్‌లో ఉన్న ప్రేమ్ తనేజాతో మాట్లాడేందుకు శాటిలైట్ ఫోన్లను వాడారు. ఈ ఫోన్ల ద్వారా చేసిన కాల్స్‌ను ట్రేస్ చేయడం దాదాపు అసాధ్యం. కాల్ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే డేటా మొత్తం డిలీట్ అయ్యే విధంగా వ్యవస్థను సెట్ చేసుకున్నారు. దీంతో తమ అక్రమ కార్యకలాపాలపై ఆధారాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఒక ఫిర్యాదు.. స్కామ్ గుట్టు విప్పిన క్షణం
ఈ మెగా స్కామ్‌ను బయటపెట్టినది అక్షయ నగర్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదే. ‘నియో సిస్టమ్’ యాప్‌లో పెట్టుబడి పెడితే రూ.3.03 కోట్లు లాభం వచ్చిందని టెలిగ్రామ్‌లో మెసేజ్ రావడంతో అతను ఆనందపడ్డాడు. అయితే ఆ డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే మరికొంత మొత్తం చెల్లించాలని చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు.
డీసీపీ ఎం. నారాయణ నేతృత్వంలో ఏర్పాటైన స్పెషల్ సైబర్ టీమ్ టెక్నికల్ ఆధారాలతో లోతైన దర్యాప్తు చేపట్టింది. డబ్బు ట్రాన్సాక్షన్లు, డిజిటల్ ట్రైల్స్ ఆధారంగా ఢిల్లీ, బెంగళూరు, రాజస్థాన్, జార్ఖండ్ ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
భారీగా స్వాధీనం
నిందితుల వద్ద నుంచి అధికారులు రూ.1 కోటి నగదు, అర కిలో బంగారం, 58 మొబైల్ ఫోన్లు, 7 ల్యాప్‌టాప్‌లు, శాటిలైట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగా, ఈ స్కామ్‌లో మరిన్ని అంతర్జాతీయ లింకులు బయటపడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఒక చిన్న తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా, ఒక సాధారణ కంప్లెయింట్ దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్ నేర సామ్రాజ్యాన్ని కూల్చివేసింది. డిజిటల్ లాభాల పేరుతో వచ్చే ఆకర్షణలకు లోనుకాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
