Murder: రూ.4 కోట్లకు బీమా చేయించి అన్నను చంపాడు
కరీంనగర్- న్యూస్‌టుడే, కరీంనగర్ నేరవార్తలు: చేసిన అప్పులు తీర్చడానికి మానసిక పరిపక్వత లేని అన్న పేరిట బీమా చేయించి.. దారుణంగా అంతమొందించి ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో జరిగింది. బీమా సంస్థ ప్రతినిధుల అనుమానంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. కేసు వివరాలు కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం వెల్లడించారు. రామడుగుకు చెందిన మామిడి నరేశ్(30) మూడేళ్ల కిందట రెండు టిప్పర్‌లను కొనుగోలు చేసి వాటిని అద్దెకిస్తూ జీవిస్తున్నాడు. కొన్నాళ్లుగా వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో ఈఎంఐలు చెల్లించడానికి ఇబ్బందులు పడ్డాడు. తెలిసినవారి దగ్గర అప్పులు చేశాడు. దీంతోపాటు స్టాక్ మార్కెట్లోనూ పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఇలా రూ.1.50 కోట్ల వరకు అప్పులయ్యాయి. దీంతో తనతోపాటు ఇంట్లోనే ఉంటున్న మానసికంగా పరిపక్వత లేని, అవివాహితుడైన అన్న వెంకటేశ్(37)ను చంపాలని కుట్ర చేేశాడు.
ప్రణాళిక ప్రకారం రెండు నెలల కిందటి నుంచి వెంకటేశ్ పేరుపై నాలుగు ప్రైవేటు బీమా సంస్థలతోపాటు ప్రభుత్వ బీమా సంస్థల నుంచి వేర్వేరుగా రూ.4.14 కోట్ల బీమాను చేయించాడు. ఇదే సమయంలో నముండ్ల రాకేశ్(28) అనే వ్యక్తి తనకు చెల్లించాల్సిన రూ.7 లక్షల కోసం నరేశ్‌పైన ఒత్తిడి పెంచాడు. దీంతో తన అన్నని ప్రణాళిక ప్రకారం చంపుతున్నానని సహకరిస్తే ఇవ్వాల్సిన రూ.7 లక్షలకు అదనంగా రూ.13 లక్షలు ఇస్తానని చెప్పాడు. రూ.2 లక్షలు ఇస్తానని టిప్పర్ డ్రైవర్ ప్రదీప్(29)ను సైతం ఒప్పించాడు. ఒకవేళ తప్పిదం బయటపడితే అందరం శిక్షను భరించాలని ముగ్గురూ కనపడే విధంగా ఒప్పంద సమయంలోనే వీడియో తీసుకున్నారు. పథకంలో భాగంగా గత నెల 29న రాత్రి గ్రామ శివారులో టిప్పర్ ఆగిపోయిందని డ్రైవర్ ఫోన్ చేసి నరేశ్‌కు చెప్పాడు. తన అల్లుడు సాయి బైక్‌పై అన్న వెంకటేశ్‌ను టిప్పర్ వద్దకు పంపించాడు. వెనకాలే నరేశ్ వెళ్లాడు. టిప్పర్ చక్రం కింద జాకీ పెట్టాలని.. వెంకటేశ్‌ని కింద పడుకోబెట్టి నరేశ్ టిప్పర్‌ను నడుపుతూ ముందుకు కదిలించాడు. దీంతో వెంకటేశ్ టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులకు చెప్పాడు. 30వ తేదీన బీమా సంస్థ ప్రతినిధులు రాగా సంఘటన గురించి నరేశ్ చెప్పిన విధానంపై వారికి అనుమానం వచ్చి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పూర్తిస్థాయిలో విచారణ చేయగా హత్య చేసినట్లు తేలడంతో నరేశ్‌తోపాటు రాకేశ్, ప్రదీప్‌లను అరెస్ట్ చేశారు.
