న్యూఢిల్లీ AI సమ్మిట్‌లో నిరసనపై నరేంద్ర మోదీ ఆగ్రహం — ‘దేశాన్ని అవమానించారు’
న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నాయకులు అర్థనగ్నంగా నిరసన తెలపడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం (ఫిబ్రవరి 22) మీరట్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, గ్లోబల్ ఈవెంట్‌ను కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు వాడుకుందని మండిపడ్డారు. ప్రపంచ వేదికను కాంగ్రెస్ మురికి, నగ్న రాజకీయాల వేదికగా మార్చిందని విమర్శించారు.
అంతర్జాతీయ ప్రతినిధులు హాజరైన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసన చేయడం దేశానికి ఇబ్బందికరమని అన్నారు. కాంగ్రెస్ నేతలు దేశాన్ని కించపరచడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేయకుండా, నిరసనకారులను ప్రశంసించడం మరింత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాయని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కళగం, సమాజ్‌వాది పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఈ నిరసనకు దూరంగా ఉన్నాయని తెలిపారు. పార్లమెంట్‌ను నిరంతరం అడ్డుకుంటూ కాంగ్రెస్ గందరగోళం సృష్టిస్తోందని కూడా విమర్శించారు.
అసలు ఏం జరిగింది?
దేశ రాజధానిలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్నంగా నిరసన చేపట్టారు. ప్రముఖ కంపెనీల సీఈఓలు సాంకేతిక పురోగతిపై మాట్లాడుతున్న సమయంలో, కొందరు కార్యకర్తలు టీషర్టులు తీసేసి ప్రధాని మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాలతో ఉన్న టీషర్టులు ధరించి హాల్‌లోకి చొచ్చుకెళ్లారు.
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది. వెంటనే పోలీసులు చేరుకుని నిరసనకారులను బయటకు తీసుకెళ్లారు. వారిలో నలుగురిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరును బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
