హైడ్రా నుంచి కొత్త కార్యక్రమం: ఫోన్-ఇన్ ద్వారా ఫిర్యాదులకు అవకాశం
హైదరాబాద్ :
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములు, పార్కులు, కుంటలు, చెరువుల సంరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా (HYDRA) ఇప్పటికే వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడిందని అధికారులు తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్న హైడ్రా తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇక నుంచి నగరవాసులు ఫోన్-ఇన్ కార్యక్రమం ద్వారా నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని బుధవారం హైడ్రా ప్రకటించింది. ప్రతి శనివారం హైడ్రా కమిషనర్‌తో నేరుగా మాట్లాడి ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్-ఇన్ కార్యక్రమం ఫిబ్రవరి 7 (శనివారం) నుంచి ప్రారంభం కానుంది.
ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని నగర ప్రజలకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది.
ఫిర్యాదుల స్వీకరణ కోసం 040-29565750, 040-29565759 అనే ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, పార్కులు, రహదారులు, ప్రజావసర స్థలాల ఆక్రమణలు, చెరువుల్లో మట్టి పోయడం వంటి అక్రమాలపై ఫిర్యాదు చేసుకునే వీలు కల్పించారు.
గతంలో ఇచ్చిన ఫిర్యాదులు ఇంకా పరిష్కారం కాకపోతే వాటి స్థితిగతులపై కూడా ఈ ఫోన్-ఇన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడమే లక్ష్యంగా హైడ్రా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని స్పష్టం చేశారు.
