నకిలీ మానవ హక్కుల సంఘాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఉక్కుపాదం… రాష్ట్రాలకు ఆదేశాలు
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) పేరును పోలిన పేర్లతో ఏర్పడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నకిలీ సంస్థలు, వ్యక్తులపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. తీసుకున్న చర్యలపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని గురువారం స్పష్టం చేసింది.
ఇటీవల తమ దృష్టికి వచ్చిన ఒక ఘటనను కమిషన్ ప్రస్తావించింది. ఢిల్లీలో 2022లో “నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)” పేరుతో ఓ ఎన్జీవో రిజిస్టర్ అయిందని ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఆ సంస్థకు నీతి ఆయోగ్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ గుర్తింపు ఉందని ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించింది. కర్ణాటకకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ఈ సంస్థకు “స్టేట్ చైర్మన్”గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.
ఈ వ్యవహారంపై కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఇలాంటి పేర్లు ప్రజల్లో గందరగోళం సృష్టించడంతో పాటు, ఆ సంస్థలు కమిషన్‌కు అనుబంధంగా ఉన్నాయన్న తప్పుడు భావన కల్పిస్తున్నాయని అభిప్రాయపడింది. దీని వల్ల ప్రజల విశ్వాసం దెబ్బతినడమే కాకుండా, నిధుల దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలకు నోటీసులు జారీ చేసి, ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేరును దుర్వినియోగం చేస్తున్న సంస్థలను గుర్తించి వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ముఖ్యంగా ఢిల్లీలో రిజిస్టర్ అయి కర్ణాటకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నకిలీ సంస్థపై తీసుకున్న చర్యల వివరాలను రెండు వారాల్లోగా సమర్పించాలని ఢిల్లీ, కర్ణాటక అధికారులను కమిషన్ ఆదేశించింది.
