ఆ వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలేవి:ఉదాసీనంగా విద్యాశాఖ, తల్లిదండ్రుల్లో ఆందోళన
Peddapalli: ఓదెల మండలం కనగర్తి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు పై పత్రికలలో వరుస కథనాలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ మీనమేషాలు లెక్కిస్తుండడం పట్ల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిందని స్వయంగా మండల విద్యాధికారి గారు చెప్తూనే ఆ ఉపాధ్యాయుడి పై చర్యలు తీసుకోవడంలో మాత్రం అలసత్వం వహిస్తూ ఆ ఉపాధ్యాయుడికి అంతర్గతంగా వత్తాసు పలుకుతుండడం, PET నుండి PD గా ప్రమోషన్ పొందే సమయంలో తనకు సుల్తానాబాద్ లోని దగ్గరి పాఠశాలలు దొరికే అవకాశమున్న ఇక్కడే ఉండడం, ఈ సంఘటన గురించి పలువురు చర్చించుకుంటున్నారు.
ఆ ఉపాధ్యాయుడు ఎక్కడ పని చేస్తున్నాడు అనేది కూడా గోప్యంగా ఉంచటం పట్ల కూడా బయట తీవ్ర చర్చ జరుగుతున్నది. ప్రధానోపాధ్యాయుడు అతన్ని వెనకేసుకు వచ్చే వైఖరి అవలంభిస్తున్నారని, జరిగిన సంఘటన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సిన ఉపాధ్యాయుడు బాధ్యత మరిచి విద్యార్థిని గురించి చెడు ప్రచారం చేస్తుండడం పట్ల విద్యార్థులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థినిపై అభాండాలు మోపేందుకు కూడా సన్నద్ధమైన ఆ ఉపాధ్యాయుడి పై చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతూ, ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు పూర్తయిన పిదప, ఆ ఉపాధ్యాయుడిని పాఠశాలకు తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలియడంతో విద్యార్థులందరినీ వేరే పాఠశాలకు పంపించేందుకు కూడా తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారా, లేదా అని పలువురు విద్యాశాఖ అధికారులపై సందేహంతో ఉన్నారు.
