LatestTelangana

మళ్లీ మళ్లీ మరిగించిన నూనె ‘స్లో పాయిజన్’

పెద్దపేగు క్యాన్సర్, గుండె జబ్బులకు ప్రధాన కారణమని సంచలన అధ్యయనం వెల్లడి

హైదరాబాద్: వేపుళ్లు, బజ్జీలు, పకోడీలు వంటి డీప్ ఫ్రైడ్ ఆహారాల వెనుక ప్రాణాంతక ప్రమాదం దాగి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పదే పదే మరిగించిన నూనెను వాడటం వల్ల పెద్దపేగు క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీ, డయాబెటిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తాజా పరిశోధన వెల్లడించింది.

హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT) మరియు విజయవాడలోని మారిస్ స్టెల్లా కాలేజీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ రిపోర్ట్ ఇటీవల International Clinical and Medical Case Reports Journal లో ప్రచురితమైంది.

180 డిగ్రీలపై వేడి చేస్తే ప్రమాదం

నూనెను 180 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో మళ్లీ మళ్లీ వేడి చేస్తే రసాయన మార్పులు జరుగుతాయని పరిశోధకులు తేల్చారు. వేడికి నూనె ఆక్సీకరణం చెందుతుంది. హైడ్రోలిసిస్, పాలిమరైజేషన్ వంటి చర్యల వల్ల ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ప్రమాదకరమైన ట్రాన్స్ ఐసోమర్లుగా మారిపోతాయి. ఈ ప్రక్రియలో పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) అనే విషతుల్య సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మన డీఎన్‌ఏపై నేరుగా దాడి చేసి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని అధ్యయనం పేర్కొంది.

కొలోన్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం

రీహీటెడ్ ఆయిల్ వాడకం వల్ల ముఖ్యంగా పెద్దపేగు (కొలోన్) క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో ఇది రెండో స్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. మనం తీసుకునే ఆహారంలో ఉండే విషపదార్థాలే సుమారు 80 శాతం పేగు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది.

గుండె జబ్బులు, బీపీ, డయాబెటిస్

మాడిపోయిన నూనె వాడకం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి రక్తప్రసరణ దెబ్బతింటుంది. ఫలితంగా బీపీ పెరగడం, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశముందని పరిశోధకులు తెలిపారు. జంతువులపై చేసిన ప్రయోగాల్లో డీఎన్‌ఏ దెబ్బతినడం, శరీరంలో వాపు, రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కనిపించినట్లు రిపోర్ట్ పేర్కొంది.

దేశంలో నియంత్రణల లోపం

భారత్‌లో పేదరికం, ఆర్థిక పరిస్థితుల కారణంగా వాడిన నూనెను మళ్లీ వాడటం సాధారణంగా మారిందని నివేదిక తెలిపింది. కొన్ని సర్వేల ప్రకారం దేశంలో 48 శాతం మంది వారానికి ఒకటి నుంచి ఆరు సార్లు బయట ఫ్రైడ్ ఫుడ్ తీసుకుంటున్నారు. మనం తినే స్నాక్స్‌లో 21 శాతం డీప్ ఫ్రై చేసినవే. స్ట్రీట్ వెండర్లు, రెస్టారెంట్లు ఖర్చు తగ్గించుకునేందుకు ఒకే నూనెను రోజంతా వాడుతున్నట్లు అధ్యయనం పేర్కొంది.

కఠిన చర్యలు అవసరం

ఇలాంటి పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో హాస్పిటల్స్ నిండిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని, హోటల్స్‌పై తనిఖీలు పెంచాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు సోషల్ మీడియా, ప్రజారోగ్య క్యాంపెయిన్లు చేపట్టాలని, భారతీయులపై దీర్ఘకాలిక పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రుచికోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదని శాస్త్రవేత్తల హెచ్చరిక.

Cyber Post

About Cyber Post Cyber Post is a leading online news portal based in Hyderabad, dedicated to delivering accurate, timely, and trustworthy news to readers across India and beyond. Guided by our tagline — “News You Can Trust” — we are committed to upholding the highest standards of journalism in an era of rapid digital transformation and information overload. At Cyber Post, our mission is simple yet powerful: to inform, inspire, and empower our audience with credible reporting, insightful analysis, and unbiased coverage. Our team of experienced journalists and digital media professionals work around the clock to bring you the latest updates from politics, business, technology, entertainment, sports, and current affairs — all presented with integrity and clarity. Founded in Hyderabad, the city’s dynamic spirit of innovation and diversity inspires our approach to journalism. Whether it’s breaking news, investigative reports, or community stories, Cyber Post stands as a trusted source for truth in the digital age. With a growing readership and a reputation for credibility, Cyber Post continues to redefine digital news by blending traditional journalistic values with modern storytelling and technology. Cyber Post – News You Can Trust.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *