రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ – కొత్త విద్యాసంవత్సరం నుంచే 20 లక్షల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం
హైదరాబాద్ : వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే తొలి రోజునుంచే బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీ-ప్రైమరీ నుంచి పదో తరగతి వరకు చదువుతున్న సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ఉదయం పూట పోషకాహారం అందించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ విద్యార్థులకు పాలు కూడా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా సరఫరా
ప్రభుత్వ పాఠశాలల్లో వంటసౌకర్యాల లోపం, నాణ్యత సమస్యలను దృష్టిలో ఉంచుకుని ‘సెంట్రలైజ్డ్ కిచెన్’ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచే ఆయా నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు టిఫిన్ సరఫరా చేయనున్నారు.
ఈ బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలైన మన్నా ట్రస్ట్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్లకు అప్పగించాలని నిర్ణయించారు. హైదరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మేడ్చల్, వరంగల్ జిల్లాల్లో మన్నా ట్రస్టుకు బాధ్యతలు ఇవ్వాలని, మిగిలిన జిల్లాల్లో అక్షయ పాత్ర ద్వారా అమలు చేయాలని భావిస్తున్నారు.
ప్రతి కిచెన్ నిర్మాణానికి ఒకటిన్నర నుంచి రెండు ఎకరాల స్థలాన్ని లీజ్ పద్ధతిలో కేటాయించనున్నారు. సీఎస్ రామకృష్ణారావు ఇప్పటికే కలెక్టర్లకు భూముల గుర్తింపు, కేటాయింపుపై ఆదేశాలు జారీ చేశారు. సీఎం నియోజకవర్గమైన కొడంగల్‌లో ఇప్పటికే అన్ని పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలులో ఉంది.
దశలవారీగా అమలు
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కాకుండా, వసతులు సిద్ధంగా ఉన్న నియోజకవర్గాల్లో స్కూళ్లు తిరిగి ప్రారంభమైన మొదటి రోజునుంచే బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ల నిర్మాణం పూర్తయ్యే కొద్దీ పథకాన్ని దశలవారీగా విస్తరించనున్నారు.
పెరుగుతున్న కేటాయింపులు, పోషకాహార మెనూ
ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి రూ.10.50 కేటాయిస్తుండగా, ప్రైమరీ విద్యార్థులకు రూ.11, హైస్కూల్ విద్యార్థులకు రూ.13కు పెంచే యోచనలో ఉన్నారు. మిల్లెట్ ఇడ్లీ, దోశ, చపాతి, టమాట రైస్, కిచిడీ వంటి పోషకాహార టిఫిన్ ఇవ్వాలని మెనూ సిద్ధం చేస్తున్నారు.
ఈ పథకం అమలుతో పేద విద్యార్థులు ఆకలితో బడికి వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా, చదువుపై దృష్టి పెరుగుతుందని, డ్రాప్‌అవుట్ రేటు తగ్గుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
పెండింగ్ బకాయిల అంశం
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సుమారు 5 వేల పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఆ అమలుకు సంబంధించిన సుమారు రూ.13 కోట్ల బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని హెడ్మాస్టర్లు చెబుతున్నారు. వాటిని త్వరితగతిన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
