ఆన్‌లైన్ గేమ్ మృత్యుపాశం.. ముగ్గురు అక్కాచెల్లెల్లు ఒకేసారి ఆత్మహత్య
ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్:
ముగ్గురు అక్కాచెల్లెలు… ఒకే గది, ఒకే జీవితం, ఒకే బంధం… చివరికి మరణంలోనూ విడిపోలేదు. 12, 14, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు మైనర్ బాలికలు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆన్‌లైన్ టాస్క్ ఆధారిత కొరియన్ గేమ్‌కు బానిసలవడం ఈ విషాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
మృతులను నిషిక (16), ప్రాచి (14), పాఖి (12)గా గుర్తించారు. ముగ్గురూ స్థానిక స్కూల్‌లో చదువుతున్నారు. తినడం, చదవడం, స్కూల్‌కు వెళ్లడం, ఇంట్లో ఒకే గదిలో నిద్రపోవడం… అన్నీ కలిసే చేసే వారు. అక్కాచెల్లెల్ల మధ్య అపూర్వమైన అనుబంధం ఉండేది. అయితే అదే బంధం చివరకు విషాదాంతానికి దారి తీసింది.
ఇటీవల ముగ్గురు బాలికలు ఆన్‌లైన్ టాస్క్ ఆధారిత గేమ్‌కు పూర్తిగా అలవాటు పడ్డారు. తిండి, నిద్ర, చదువు మానేసి గంటల తరబడి గేమ్ ఆడుతుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు వారిని మందలించారు. ఇదే సమయంలో గేమ్‌లో ఇచ్చే టాస్కులు పూర్తి చేయలేకపోవడం, గేమ్ నిర్వాహకుల నుంచి వస్తున్న మానసిక ఒత్తిడి కారణంగా వారు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు చెబుతున్నారు.
మంగళవారం రాత్రి ముగ్గురు బాలికలు తమ అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తుకు వెళ్లి, “మమ్మీ.. డాడీ.. క్షమించండి” అంటూ సూసైడ్ నోట్ రాసి, నిచ్చెన సహాయంతో పైకెక్కి ఒకేసారి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికలు అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ గేమ్ బానిసత్వమే ఈ కఠిన నిర్ణయానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
ముగ్గురు కూతుర్లను ఒకేసారి కోల్పోయిన తండ్రి చేతన్ కుమార్ గుండెలవిసేలా రోదించాడు. “నా ఇంటి మహారాణులు నన్ను వదిలి వెళ్లిపోయారు. వాళ్లు మొబైల్‌లో లూడో గేమ్ ఆడుతున్నారనుకున్నా. అది డెత్ గేమ్ అవుతుందని అస్సలు ఊహించలేదు. ఇది టాస్క్ గేమ్ అని, ఇంత ప్రమాదకరమని పోలీసులు చెప్పే వరకు నాకు తెలియదు” అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. తన కూతుర్లు నిచ్చెన ఉపయోగించి 9వ అంతస్తు నుంచి దూకిన విషయాన్ని చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఆన్‌లైన్ గేమ్ బానిసత్వంతో ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ఆన్‌లైన్ టాస్క్ గేమ్స్ పిల్లల జీవితాలపై చూపుతున్న ప్రమాదకర ప్రభావంపై మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిపుణులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లల మొబైల్ వినియోగంపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని సూచిస్తున్నారు.
