జమ్మూ కాశ్మీర్లో పాక్ డ్రోన్ల కలకలం.. బార్డర్లో మరోసారి దాయాది దేశం కవ్వింపు చర్యలు
శ్రీనగర్: సరిహద్దు వెంబడి పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. ఆదివారం (జనవరి 11) జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపాయి. సరిహద్దు వెంబడి సుమారు ఐదు డ్రోన్లను గుర్తించిన భద్రతా దళాలు వెంటనే హై అలర్ట్ అయ్యాయి.
ఇండియన్ ఆర్మీ కాల్పులు జరపడంతో డ్రోన్లు తిరిగి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాయని అధికారులు వెల్లడించారు. సరిహద్దు అవతల నుంచి భారత గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్లు సున్నితమైన ప్రదేశాలపై కొద్దిసేపు అనుమానస్పదంగా సంచరించాయి.
వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం కాల్పులు జరపడంతో డ్రోన్లు తిరిగి పాకిస్తాన్ వైపు వెళ్లాయని అధికారులు తెలిపారు. డ్రోన్ల కదలికలతో తర్వాత అనుమానాస్పద పదార్థాలు లేదా ఆయుధాలు ఏవైనా భారత భూభాగంలో జారీ విడిచి ఉండొచ్చనే అనుమానంతో సైన్యం, పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు జాయింట్ సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, గత శుక్రవారం కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్లు రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, 16 రౌండ్ల మందుగుండు సామగ్రి, ఒక గ్రెనేడ్ ను భారత భూభాగంలో జార విడిచిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం వీటిని స్వాధీనం చేసుకుంది.
