“జనవరి 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్న సిపిఐ శతజయంతి ఉత్సవాల బహిరంగ సభను భారీ సంఖ్యలో పాల్గొని ఘనంగా జయప్రదం చేయండి.”
ప్రజల పక్షాన పోరాటాలు చేసేది సిపిఐ పార్టీ మాత్రమే
సిపిఐ పార్టీలో వివిధ పార్టీలకు సంబంధించిన 15 కుటుంబాలు చేరిక…
ఖమ్మంలో సిపిఐ శతజయంతి బహిరంగ సభను జయప్రదం చేయాలి:
సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
జనవరి 18వ తేదీన ఖమ్మంలో సిపిఐ పార్టీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను భారీగా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
శుక్రవారం తిరుమలగిరి మండలం మావిడాల గ్రామం ఎక్స్‌రోడ్‌లో నిర్వహించిన తిరుమలగిరి–తుంగతుర్తి మండల సమితి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశం తిరుమలగిరి, తుంగతుర్తి మండల కార్యదర్శులు ఎస్‌డీ ఫయాజ్, పాల్వాయి పున్నయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అడుగడుగునా నిర్బంధాలు, ప్రతినిత్యం శత్రువుల దాడుల మధ్య సాగిన పోరాటాల విజయగాథే భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల చరిత్ర అని అన్నారు. 1925 డిసెంబర్ 26న స్థాపితమైన సిపిఐ, అప్పటినుంచి నేటివరకు అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలబడిందని గుర్తు చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, దొరలు–భూస్వాముల గడిలను బద్దలు కొట్టడంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ, ప్రజాసమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ పోరాటాలు చేస్తోందని ఆయన అన్నారు. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, కార్మికులు 100 ఏళ్ల పోరాటంతో సాధించుకున్న ఎనిమిది గంటల పని హక్కును నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి హరించిందని విమర్శించారు. అలాగే పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, పేదలకు పని దొరకకుండా చేస్తున్నదని ఆరోపించారు.
ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక, దుర్మార్గ విధానాలపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు జరుగుతాయని, ఆ పోరాటాలలో ప్రజలు భాగస్వాములై విజయం సాధించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కోక్యతాండ నుంచి 15 కుటుంబాలు సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు సమక్షంలో సిపిఐ పార్టీలో చేరాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లంల యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గుగులోతు రాజారాం, ఎస్‌కే ఏక్‌బాల్, త్రిపురాల శ్రీకాంత్, జంపాల మల్లయ్య, ఇస్లావత్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
