తిరుమలగిరి పోలింగ్ కేంద్రం వద్ద రాజకీయ వేడి
తిరుమలగిరి:మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తిరుమలగిరి 7వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేయడంతో అక్కడి వాతావరణం వేడెక్కింది.
పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ బీఆర్‌ఎస్‌లో అహంకారం తగ్గలేదని విమర్శించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొంటూ, 15 వార్డుల్లో కనీసం 12 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ దంపతులు మీడియాతో మాట్లాడుతూ, ఓటు ప్రజాస్వామ్యానికి శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. తిరుమలగిరి చైర్మన్ పీఠం బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.
ఇలా పరస్పర ఆరోపణలు, విమర్శలతో తిరుమలగిరి రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది.
