అబార్షన్ తర్వాత గర్భిణి మృతి.. హాస్పిటల్ ముందు డెడ్‌బాడీతో కుటుంబ సభ్యుల నిరసన
సిద్దిపేట రూరల్:
గర్భంలో ఉన్న శిశువుకు హార్ట్ సమస్య ఉందని వైద్యులు సూచించడంతో అబార్షన్ చేయించుకున్న గర్భిణి మృతి చెందడం కలకలం రేపింది. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మృతదేహంతో హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.
మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన అశ్విని (26) రెండోసారి గర్భం దాల్చింది. ఆమె సిద్దిపేట పట్టణంలోని శివాజీ నగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్‌ను సంప్రదించింది. టిఫ్ఫా స్కానింగ్ నిర్వహించిన వైద్యులు శిశువుకు గుండె సమస్య ఉందని, అబార్షన్ చేయించుకోవాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వైద్యుల సూచన మేరకు శుక్రవారం ఆసుపత్రిలో చేరిన అశ్వినికి అర్ధరాత్రి అబార్షన్ నిర్వహించి శిశువును తొలగించారు. అనంతరం తీవ్ర రక్తస్రావం జరుగుతోందని చెప్పి హడావుడిగా మరో ఆసుపత్రికి తరలించారని బంధువులు ఆరోపించారు.
శనివారం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడికి తరలించగా అశ్విని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. సరైన వైద్యం అందించకపోవడమే ఆమె మరణానికి కారణమని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మృతదేహంతో ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు నిరసన చేపట్టగా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హాస్పిటల్ యాజమాన్యం సహాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
