గజ్వేల్‌లో హరీశ్ రావుకు నిరసన సెగ.. మల్లన్నసాగర్ ముంపు బాధితుల ఆందోళన
హైదరాబాద్:
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అన్ని ప్రధాన పార్టీలు వేగం పెంచడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం, కేసీఆర్ స్వస్థలంలో మాజీ మంత్రి హరీశ్ రావుకు నిరసన సెగ తగిలింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులు ప్రచారానికి ముందే నిరసనకు దిగారు.
హరీశ్ రావు రాకముందే ముంపు గ్రామాల ప్రజలు “హరీశ్ రావు డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ముంపు బాధితులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇదిలా ఉండగా, గజ్వేల్ మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించిన హరీశ్ రావు కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో గజ్వేల్ రోడ్లపై పడిన గుంతలను కూడా పూడ్చలేదని విమర్శించారు. గజ్వేల్‌కు అభివృద్ధి తీసుకొచ్చింది కేసీఆరేనని, కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదన్నారు.
మిషన్ కాకతీయపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన హరీశ్ రావు, కేసీఆర్ పాలనలో గజ్వేల్‌లో భూముల ధరలు కోట్లకు పెరిగాయని, రేవంత్ రెడ్డి వచ్చాక బంగారం ధరలు పెరిగి భూముల ధరలు పాతాళానికి పడిపోయాయని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కట్టిన భవనాలకు రిబ్బన్ కట్ చేయడం, కేసీఆర్ ప్రారంభించిన పథకాలను కొనసాగించడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు.
బీజేపీ పాలనలో పాల ధరలు, జీఎస్టీలు పెరిగాయని ఆరోపించిన హరీశ్ రావు, కరోనా సమయంలో తాను ప్రజల మధ్య తిరిగానని, అప్పట్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. “మీ కోసం మేము ఉన్నాం.. మా కోసం మీరు ఉండాలి. ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా, కాళ్లూ మొక్కినా బీఆర్ఎస్కే ఓటు వేయాలి” అంటూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
