మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ
మంచిర్యాల:
మంచిర్యాల జిల్లాలో కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ తగిలింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన సమయంలో స్థానిక ప్రజలు తమ ప్రాంత సమస్యలపై మంత్రిని నిలదీశారు. ముఖ్యంగా రహదారి పనులు చేపట్టకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా తమ ప్రాంతంలో ఒక్క అభివృద్ధి పని కూడా కనిపించడం లేదని స్థానికులు ప్రశ్నించారు. రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని, కనీస వసతుల కల్పనకూ చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ప్రశ్నలతో అసహనం
స్థానికుల నుంచి ప్రశ్నలు ఎదురవడంతో మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. సమస్యలపై ప్రశ్నించిన ప్రజలతో మంత్రి వివేక్‌తో పాటు డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రహదారి అవసరమైతే ప్రభుత్వాన్ని అడుక్కోండంటూ నిర్లక్ష్యంగా స్పందించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను శ్రద్ధగా వినకుండా దురుసుగా వ్యవహరించారంటూ మంత్రి తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ వీడియో
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజాప్రతినిధుల వైఖరిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
