అమరావతిలో క్వాంటం విప్లవానికి శ్రీకారం.. ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’కి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతికంగా అగ్రగామి రాష్ట్రంగా నిలిపే దిశగా కీలక అడుగు పడింది. రాజధాని అమరావతిలోని ఉద్దండరాయుని పాలెంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా భారతదేశానికే చారిత్రక రోజు అని అన్నారు. ఇవాళ క్వాంటమ్ వ్యాలీ భవనాలకు మాత్రమే పునాది వేయడం కాదని, గ్లోబల్ క్వాంటం రివల్యూషన్‌లో భాగమయ్యే నిపుణులకు కూడా పునాది వేస్తున్నామన్నారు. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించిందని గుర్తుచేశారు. ఇది క్వాంటం ట్రాన్సిషన్‌కు కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న తరుణంలో క్వాంటం టెక్నాలజీ అత్యంత కీలకమైన ముందడుగు అని చంద్రబాబు అన్నారు. గతంలో వచ్చిన వ్యవసాయ, పారిశ్రామిక విప్లవాలను భారత్ పూర్తిగా అందిపుచ్చుకోలేకపోయినా, ఐటీ విప్లవంలో మాత్రం దేశం ముందంజ వేసిందని గుర్తుచేశారు.
హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఏర్పాటు చేయడం గేమ్ ఛేంజర్‌గా మారిందని, అదే తరహాలో క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. భారత్‌లో తొలి క్వాంటమ్ వ్యాలీగా అమరావతి నిలవనుందని, ఇది కూడా ఓ సాంకేతిక విప్లవానికి నాంది అవుతుందని తెలిపారు. సాంకేతిక విప్లవాన్ని ఆచరణలో పెట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ స్టాక్ ప్రారంభమైందని, దీని ద్వారా 6జీ కమ్యూనికేషన్ కూడా సాధ్యమవుతుందన్నారు.
గతంలో ఐటీ, సెల్‌ఫోన్ల గురించి మాట్లాడినప్పుడు తనను విమర్శించిన వారి పిల్లలే నేడు అమెరికాలో ఐటీ రంగంలో స్థిరపడ్డారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయే 30–40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాను ప్రణాళికలు రూపొందిస్తానని చెప్పారు. టెక్నాలజీని అందిపుచ్చుకున్న దేశాలే భవిష్యత్తులో అభివృద్ధి సాధిస్తాయని స్పష్టం చేశారు.
క్వాంటం వ్యాలీతో పాటు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలకు కూడా ఏపీ కేంద్రంగా మారుతుందని సీఎం వెల్లడించారు. క్వాంటం డిజైన్స్, ఉత్పత్తులు, ఇంటెలెక్ట్యువల్ ప్రాపర్టీలకు అమరావతి హబ్‌గా నిలుస్తుందని చెప్పారు. డిఫెన్స్, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఫైనాన్స్, క్లైమేట్ మోడలింగ్ రంగాల్లో అమరావతి క్వాంటం వ్యాలీలో పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. ఇకపై ప్రపంచం మొత్తం సిలికాన్ వ్యాలీ కాదు, అమరావతి క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడే రోజులు వస్తాయన్నారు.
క్వాంటం టెక్నాలజీ కోర్సులకు ఇప్పటికే 66 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని, అందులో 50 శాతం ఏపీ విద్యార్థులేనని తెలిపారు. కుప్పానికి చెందిన ఓ విద్యార్థి బ్లడ్ ప్రెషర్, పల్స్ కొలిచే యాప్ రూపొందించిన ఉదాహరణను ప్రస్తావిస్తూ, విద్యార్థులు గేమ్ ఛేంజర్లుగా మారాలని పిలుపునిచ్చారు. ఏఐ, క్వాంటం ఆల్గరిథమ్‌లను అడాప్ట్ చేసుకోవాలని సూచించారు.
ఇప్పటికే స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, సెమికండక్టర్ సిటీ, మెడ్‌టెక్ వంటి ప్రాజెక్టులు ప్రారంభించామని తెలిపారు. తిరుపతిలో స్పేస్ సిటీకి రావాలని కేంద్ర మంత్రిని కోరుతూ, అక్కడి నుంచి భవిష్యత్తులో శాటిలైట్ లాంచ్ చేసే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ల్యాండ్ పూలింగ్ విధానంతో ప్రపంచంలోనే అరుదైన రీతిలో రాజధాని నిర్మాణం జరుగుతోందని, రైతులే ఇందులో ప్రధాన భాగస్వాములని చంద్రబాబు తెలిపారు. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్‌గా, ప్రపంచశ్రేణి క్వాంటం టెక్నాలజీ నగరంగా మారుతుందని చెప్పారు. భారత్‌లో తొలి 133-క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.
