ర్యాపిడో–ఓలా–ఉబెర్ డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్:
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 7న ర్యాపిడో, ఓలా, ఉబెర్ డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ‘ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్’ పేరుతో ఈ నిరసన చేపట్టారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) పిలుపు మేరకు యాప్ ఆధారిత ట్రాన్స్‌పోర్ట్ సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి.
అయితే హైదరాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమ్మెలో పాల్గొనని క్యాబ్ డ్రైవర్లను కొందరు డ్రైవర్లు అడ్డుకుంటూ, బలవంతంగా సమ్మెలో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారు. క్యాబ్ బుక్ చేసి డ్రైవర్లను పిలిపించి యాప్ ఆఫ్ చేయిస్తున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నార్సింగి సర్కిల్, కోకాపేట్ ప్రాంతాల్లో రోడ్డుపై వెళ్తున్న ట్యాక్సీలను అడ్డుకుని డ్రైవర్లతో వాగ్వాదానికి దిగారు. యాప్ ఆఫ్ చేసి సమ్మెలో పాల్గొనాలంటూ కార్లకు అడ్డంగా నిలిచారు.
ఈ సమ్మెలో ర్యాపిడో, ఉబెర్, ఓలాతో పాటు ఆటోలు, గూడ్స్ వాహనాలు, పోర్టర్ డ్రైవర్లు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అనేక ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. గిగ్ వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కనీస రేట్లు నిర్ణయించి కంపెనీల దోపిడీని అరికట్టాలని కోరారు. ఓలా, ఉబెర్, ర్యాపిడో సేవలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో ఆటో, క్యాబ్, టాక్సీ, లారీ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు బంద్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర మోటార్ కార్మికుల సంఘాల జేఏసీ ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని తెలిపారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే దీర్ఘకాలిక సమ్మెకు కూడా సిద్ధమని హెచ్చరించారు.
