రిజర్వేషన్ ‘పరేషాన్’.. అప్పుడే నిండిన సంక్రాంతి రైళ్లు
సంక్రాంతి పండుగకు నగరంలోని ప్రముఖమైన కాచిగూడ స్టేషన్ నుంచి వెళ్లే అన్ని రైళ్లలోనూ నిరీక్షణ జాబితాలు (వెయిటింగ్ లిస్ట్‌లు) కనబడుతున్నాయి. పండుగను తమ సొంతూళ్లలో జరుపుకోవడానికి నగరవాసులు రెండు నెలల ముందుగానే టిక్కెట్లను రిజర్వేషన్ చేయించుకున్నారు. దీంతో 2026 జనవరి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు జరుపుకొనే సంక్రాంతి పండుగకు టిక్కెట్లు దొరకని పరిస్థితి. చివరి నిమిషంలో ఎవరైనా టిక్కెట్లు రద్దు చేసుకోకపోతారా, తమకు దొరక్క పోతాయా అనే ఆశాభావంతో నగర ప్రజలు ఉన్నారు.
ఏపీ రైళ్లకు డిమాండ్
సంక్రాంతిని ఏపీలో ఘనంగా జరుపుకొంటారు. నగరంలో స్థిరపడ్డ వారు పండగను తమ స్వస్థలాల్లో కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి వెళుతుండటంతో రైళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సు ఛార్జీలతో పోల్చుకుంటే టిక్కెట్ ధరలు తక్కువే. కాచిగూడ నుంచి నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు వెళుతున్నా ఏపీలోని పలు నగరాలు, పట్టణాలకు వెళ్లే వాటికి ప్రాధాన్యత ఉంది. మహబూబ్‌నగర్-కాచిగూడ-విశాఖ, గుంటూరు, తెనాలి రేపల్లె డెల్టా ఎక్స్‌ప్రెస్‌తో పాటు కర్నూల్ మీదుగా రాకపోకలు సాగించే చెన్నై చెంగల్పట్టు, పుదుచ్చేరి, బెంగళూర్-అశోకపురం, చిత్తూరు వెంకటాద్రి, యశ్వంత్‌పూర్ తదితర రైళ్లలో పండుగకు ముందుగానే టిక్కెట్ల రిజర్వేషన్ అయిపోయింది .
ఆ రైళ్లు పునరుద్ధరిస్తే మేలు…
కరోనా సమయంలో రద్దు చేసిన కాచిగూడ-టాటానగర్ రైలును నేటికీ పునరుద్ధరించలేదు. ఈ రైలు కాచిగూడ నుంచి గుంటూరు, విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస మీదుగా టాటానగర్ వెళ్లేది. దీనికి నగరవాసుల నుంచి చాలా డిమాండ్ ఉండేది. ప్రత్యేక రైలుగా నడిపిన కాచిగూడ-కాకినాడ రైలును నిలిపివేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో టాటానగర్, కాకినాడ రైళ్లను పునరుద్ధరించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
తాండూరు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు

తాండూరు పట్టణం, న్యూస్‌టుడే: తాండూరు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలు(07119) ఈనెల 17, 31వ తేదీల్లో బయలుదేరి వికారాబాద్, తాండూరు మీదుగా కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మళ్లీ రైలు(07120) ఈనెల 19, జనవరి 2వ తేదీల్లో కొల్లాం నుంచి సికింద్రాబాద్‌కు వస్తుంది.
