Revanth Reddy: నిన్నటి వరకు ఒక లెక్క.. గ్లోబల్ సమిట్ తర్వాత మరో లెక్క: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు.. ముఖ్యమంత్రిగా తనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ధన్యవాదాలు తెలిపారు. జాతి కోసం.. జనహితం కోసం.. కలలు కనాలంటే ధైర్యం, గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంకల్పం కావాలంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సరిగ్గా రెండేళ్ల క్రితం తనకు ధైర్యమిచ్చి ఓటుతో ఆశీర్వదించిన నాలుగు కోట్ల ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్ల ప్రస్థానంలో అహర్నిశలూ అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించినట్లు పేర్కొన్నారు. గత పాలన శిథిలాల కింద కొనఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోసినట్లు సీఎం పేర్కొన్నారు.
ఈ పథకాలు.. రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు
రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. ‘‘ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్ధతు ఇచ్చి అదానీ, అంబానీల్లా వ్యాపార రంగంలో నిలిపాం. బలహీనవర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పాం. వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశాం. చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రమని నమ్మి.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశాం. స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలకు శ్రీకారం చుట్టాం. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్దాంతంగా ముందుకు సాగుతున్నాం. ‘జయ జయహే తెలంగాణ’ అన్న ప్రజాకవి అందెశ్రీ గేయానికి, జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చి గౌరవించాం. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, 500 రూపాయలకే గ్యాస్, సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు.
ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క
స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి.. ఎక్కడ ఉండాలో లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశాం. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్‌కు ప్రాణం పోశాం. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీ సౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. భారతదేశ గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశాం. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. నిన్నటి వరకు ఒక లెక్క… రేపటి తెలంగాణ గ్లోబల్ సమిట్ తర్వాత మరో లెక్క. నిన్న, నేడు, రేపు ప్రజల ఆశీర్వాదమే ఆయుధం.. ప్రేమాభిమానాలే సర్వం… సహకారమే సమస్తం. తెలంగాణ ప్రజలు తోడుగా ఉన్నంత వరకు… గొంతులో ఊపిరి ఉన్నంత వరకు… తెలంగాణ రైజింగ్‌కు తిరుగు లేదు. అందరికీ ప్రజా పాలన రెండేళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు’’ అని సీఎం తెలిపారు.
