హైదరాబాద్లో పెరుగుతున్న ఎస్ఓ₂ కాలుష్యం.. నియంత్రించకపోతే ప్రమాదమే: ఐఐటీ కాన్పూర్ నివేదిక
హైదరాబాద్ సిటీ :
కంటికి కనిపించదు.. వాసన ఉండదు.. కానీ ఊపిరి పీల్చినప్పుడల్లా శరీరాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీసే విషవాయువు సల్ఫర్ డయాక్సైడ్ (SO₂). హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ వాయువు ఉద్గారాలు క్రమంగా పెరుగుతున్నాయని, నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన ప్రమాదం తప్పదని తాజాగా విడుదలైన ఐఐటీ కాన్పూర్ నివేదిక హెచ్చరించింది.
హైదరాబాద్లో సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరుతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ విషవాయువును దీర్ఘకాలం ఊపిరి పీల్చితే ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలగడంతో పాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది.
నివేదిక ప్రకారం, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిసరాల్లో రోజుకు సగటున 18.101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతోంది. ఇందులో దాదాపు 92 శాతం ఉద్గారాలు పారిశ్రామిక కార్యకలాపాల నుంచే వెలువడుతున్నట్లు వెల్లడైంది. మరోవైపు హైదరాబాద్ నగర పరిధిలో రోజుకు సగటున 10.701 కిలోల ఎస్ఓ₂ ఉద్గారాలు నమోదవుతుండగా, వీటిలో 91 శాతం వరకు వాహనాల వల్లే విడుదలవుతున్నాయని, ముఖ్యంగా డీజిల్ వాహనాలే ప్రధాన కారణమని నివేదిక తెలిపింది.
ఈ కాలుష్యాన్ని వెంటనే నియంత్రించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పాటు పర్యావరణ నష్టం కూడా తప్పదని హెచ్చరించింది. సల్ఫర్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో కలిసినప్పుడు ఆమ్ల వర్షాలకు దారితీసి, నేల సారాన్ని తగ్గించి పంటలను దెబ్బతీసే ప్రమాదం ఉందని పేర్కొంది.
ప్రత్యేకంగా పారిశ్రామిక ప్రాంతాలు, అధిక ట్రాఫిక్ ఉన్న సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ఈ కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. 2010 నుంచి 2020 మధ్యకాలంలో తీసుకున్న కొన్ని నియంత్రణ చర్యల వల్ల ఎస్ఓ₂ ఉద్గారాల్లో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, తాజా అధ్యయనంలో మళ్లీ పెరుగుదల నమోదైనట్లు ఐఐటీ కాన్పూర్ నివేదిక స్పష్టం చేసింది.
