Road Accident: అమ్మా.. వెళ్లొస్తానని చెప్పి.. అంతలోనే మృత్యుఒడికి
కారు ఢీకొని ఎంబీబీఎస్ విద్యార్థిని దుర్మరణం
హయత్‌నగర్, చిలప్‌చెడ్, న్యూస్‌టుడే: బిడ్డ.. బాగా చదువుతోందని పల్లెటూరు వదిలి నగరానికొచ్చారు.. అనుకున్నట్టే ఆమె వైద్యవిద్యలో సీటు దక్కించుకుంది. వేరే పట్టణంలో ఉంటూ వారాంతాల్లో వచ్చి అమ్మానాన్నలతో ఉండి తిరిగి వెళ్తుంటుంది. ఎప్పటి మాదిరిగానే సోమవారం ‘అమ్మా వెళ్లొస్తా’ అంటూ తల్లికి చెప్పి.. తండ్రితో కలిసి బయల్దేరింది. రహదారిపైకి అడుగు పెట్టగానే కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. చదువుల తల్లి అక్కడికక్కడే తనువు చాలించింది. తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. చిలప్‌చెడ్ మండలం చిట్కుల్‌కు చెందిన యంసాని పాండు, కల్యాణి దంపతులకు కుమారుడు, కుమార్తె ఐశ్వర్య (19) ఉన్నారు. పాండుతో సహా ముగ్గురు అన్నదమ్ములకు కలిపి చిట్కుల్లో రెండెకరాల భూమి ఉంది.
కొన్నేళ్లుగా హైదరాబాద్ హయత్‌నగర్‌లోని వినాయకనగర్ కాలనీ రోడ్డు నంబరు-18లో అద్దెకు ఉంటున్నారు. ఓ లారీ ట్రాన్స్‌పోర్టులో పాండు గుమస్తాగా పని చేస్తున్నాడు. కుమారుడు యూకేలో ఎమ్మెస్ చదువుతున్నాడు. కుమార్తె ఐశ్వర్య(19) మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. శనివారం ఇంటికొచ్చిన ఐశ్వర్య సోమవారం తిరిగి వెళ్లడానికి సిద్ధమైంది. ఉదయం 7 గంటలకు తండ్రి.. కుమార్తెను బస్సెక్కించేందుకు ఆర్టీసీ కాలనీ వద్దకు వచ్చారు. జాతీయ రహదారి అవతల బస్సును నిలపగా, దాన్ని అందుకునేందుకు వెళ్తుండగా ఎల్బీనగర్ నుంచి అతివేగంతో దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఐశ్వర్య తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయింది. పాండుకు కాలు విరిగింది. కారు డ్రైవరు పారిపోయాడు. కేసు నమోదైందని హయత్‌నగర్ సీఐ నాగరాజుగౌడ్ తెలిపారు.
