నర్సాపూర్‌లో మహిళా సంఘాలకు రూ.3.50 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు – మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం: మంత్రి వివేక్ వెంకటస్వామి
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కులు, అలాగే రుణాలపై వడ్డీ డబ్బుల చెక్కులను పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.
నర్సాపూర్ పర్యటనలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు అంజనేయులు గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. 25 లేదా 26వ తేదీల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, అభ్యర్థుల విషయంలో ముందుగానే స్పష్టత రావాలని, అసమ్మతి నేతల మధ్య పోరు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న గ్రూపుల కంటే ఇంకా ఎక్కువ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎక్కువ మొత్తంలో వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చి మహిళల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. మహిళా సంఘాలకు పెట్రోల్ పంపు ఏర్పాటు చేసే అవకాశాలపై కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. ఇది మహిళలకు స్థిరమైన ఆదాయ వనరుగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలోని అన్ని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి ప్రకటించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మహిళలకు ఒక దారి చూపించిన మహానేత అని, ఆమె పేరు మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణమని అన్నారు. మహిళల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.
రాజకీయ అంశాలపై స్పందిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సుమారు రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేత సునీత రెడ్డి గుర్తుంచుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తూ నిధులు తెచ్చి ప్రజల ముందు ఉంచుతోందని తెలిపారు. బీఆర్ఎస్ కేవలం పేపర్లను చూపించి ఓట్లు వేయించుకుందని విమర్శించారు.
జూబ్లీహిల్స్‌లో మొదట మైనస్ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ గెలిచి చూపించిందని, నర్సాపూర్ పరిస్థితి అలా కాదని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్‌లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని, ప్రజల్లో గెలుపు గుర్రాలుగా గుర్తింపు ఉన్నవారికే అవకాశాలు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమిష్టి కృషితో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
