కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ భేటీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4:
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ గౌరవ సభ్యుడు శ్రీ వడ్డేపల్లి రాంచందర్ గారు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్ మోహన్ నాయుడు గారిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల సమాజ సంక్షేమం మరియు సాధికారతకు సంబంధించిన పలు అంశాలపై రాంచందర్ గారు మంత్రితో చర్చించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని విమానాశ్రయాల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.
విమానాశ్రయాల అభివృద్ధి నేపథ్యంలో నిరుద్యోగ యువతీ–యువకులకు, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
విమానాశ్రయాల్లో ప్రత్యక్షంగా మరియు అనుబంధ సేవల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం వల్ల స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాంచందర్ గారు తెలిపారు.
