మేడారం హుండీల లెక్కింపు రెండో రోజు పూర్తి
285 హుండీల కౌంటింగ్.. రూ.6.04 కోట్ల ఆదాయం
హనుమకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు రెండో రోజు శుక్రవారం (ఫిబ్రవరి 6) పూర్తయింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ భద్రత మధ్య కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా రెండో రోజు 285 హుండీలను లెక్కించినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు లెక్కించిన 285 హుండీల ద్వారా రూ.6 కోట్ల 4 లక్షల 43 వేల 636 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. మొత్తం 828 హుండీలకు గాను, ఇవాళ్టికి 285 హుండీల కౌంటింగ్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎప్పటికప్పుడు బ్యాంకులో జమ చేస్తున్నట్లు దేవాదాయశాఖ అధికారులు పేర్కొన్నారు. గురువారం (ఫిబ్రవరి 5) దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జ్యోతి ప్రజ్వలన చేసి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది.
ఈ లెక్కింపు కార్యక్రమంలో 200 మంది అధికారులు, 300 మంది వాలంటీర్లు పాల్గొంటుండగా, కౌంటింగ్ ఏరియాలో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హుండీల లెక్కింపు జరుగుతోంది.
మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతో పాటు ఆదివాసీ పూజారులు, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ సునీత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గత ఏడాది జాతరతో పోలిస్తే ఈ ఏడాది 288 అదనపు హుండీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మేడారం జాతర సందర్భంగా భక్తులు హుండీల్లో వేసిన కానుకల్లో బెల్లం, కొబ్బరి నీళ్ల కారణంగా కరెన్సీ నోట్లు తడిచిపోయిన సందర్భాలు ఉండటంతో, వాటిని లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
