నిస్వార్థ నేత ఉప్పల మల్సూరు.. ( ఇవాళ సూర్యాపేట తొలి ఎమ్మెల్యే ఉప్పల మల్సూరు వర్థంతి )
నిస్వార్థ నాయకుడు, నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపం ఉప్పల మల్సూరు. సూర్యాపేట తొలి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు ప్రజల విశ్వాసాన్ని చూరగొని శాసనసభకు ఎన్నికైన ఆదర్శ ప్రజాప్రతినిధి ఆయన. ప్రజలు అప్పగించిన ప్రతి పదవినీ బాధ్యతగా స్వీకరించి, అంకితభావంతో ప్రజాసేవ చేసిన నాయకుడు మల్సూరు.
ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ చిన్న పదవి అని భావించకుండా, సొంతూరి ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నప్పుడు కూడా అదే నిబద్ధతతో సేవలందించారు. పదవి ఎంత గొప్పదన్నది కాదు.. ప్రజలకు ఎంత ఉపయోగపడగలమన్నదే ఆయన రాజకీయ తత్వం. ఎమ్మెల్యేగా ఉన్న రోజులలో కాలినడకనే నియోజకవర్గమంతా తిరిగిన అరుదైన నేత ఉప్పల మల్సూరు.
బాల్యంలోనే తెలంగాణ సాయుధ పోరాట బాట
ఉప్పల మల్సూరు 1928లో సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగస్వామ్యులయ్యారు.
పుచ్చలపల్లి సుందరయ్య, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం, మద్దికాయల ఓంకార్, మల్లు స్వరాజ్యం వంటి ప్రముఖ నేతలతో కలిసి ఉద్యమించారు. ఉద్యమకాలంలో పలు కేసుల్లో అరెస్టై నల్గొండ, ఖమ్మం, గుల్బర్గ జైళ్లలో శిక్ష అనుభవించారు. 1951లో జైలు నుంచి విడుదలయ్యారు.
1952లో జరిగిన హైదరాబాద్ రాష్ట్ర తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థిగా సూర్యాపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1964లో సీపీఐ చీలిక తరువాత సీపీఎంలో చేరి 1972 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనూ సూర్యాపేట తొలి ఎమ్మెల్యేగా సేవలందించారు.
భుజాన సంచి.. కాలినడక ప్రయాణం
ఎమ్మెల్యేగా నియోజకవర్గమంతా భుజాన సంచితో కాలినడకన తిరిగేవారు. ఆ సంచిలో స్టాంపు, ఇంక్ ప్యాడ్, కాగితాలు ఉండేవి. గ్రామాల్లో ప్రజలు సమస్యలు చెబితే.. అక్కడికక్కడే లేఖ రాసి సంతకం చేసి అధికారులను కలవమని పంపేవారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టేవారు కాదు.
ఈ కారణంగానే ప్రజలు ఆయనను ప్రేమగా ‘ఇంక్ ప్యాడ్ ఎమ్మెల్యే’ అని పిలిచేవారు.
పేదల పక్షాన నిలిచిన ప్రజా ప్రతినిధి
ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవ చేసినా ఒక్క రూపాయి ఆస్తి కూడా సంపాదించుకోలేదు. హైదరాబాద్‌కు అసెంబ్లీ సమావేశాలకు బస్సులో వెళ్లేవారు. ఎమ్మెల్యేగా రోజుకు లభించే రూ.250 భత్యంలో రూ.150 పార్టీకి విరాళంగా ఇచ్చేవారు.
తన సొంత భూమిలో నుంచి గ్రామ పాఠశాల కోసం రెండున్నర గుంటల స్థలాన్ని దానంగా ఇచ్చారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ప్రభుత్వాలు కనీసం పింఛన్ కూడా ఇవ్వలేదు. అయినా ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు. చెప్పులు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ పార్టీ పనుల్లో నిమగ్నమయ్యారు.
త్యాగానికి చిరునామా
సర్పంచ్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే 1999 జనవరి 13న సొంతూరి సిరికొండలో తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యేగా అయినా, సర్పంచిగా అయినా.. ఎప్పుడూ పదవిని వ్యక్తిగత స్వార్థానికి వాడుకోని అరుదైన నేత మల్సూరు.
నేటికీ ఆయన కుటుంబ సభ్యులు పూరి గుడిసెల్లోనే నివసిస్తూ కూలి పనులు చేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం మల్సూరు కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, జిల్లా పేరు మల్సూరు పేరుతో పెట్టాలని ప్రజల్లో బలమైన డిమాండ్ ఉంది.
నిస్వార్థత, నిజాయితీ, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన ఉప్పల మల్సూరు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలవాల్సిందే.
