హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ మంటలు
హైదరాబాద్:
నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా శుక్రవారం (ఫిబ్రవరి 7) హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పొగ ఎక్కువగా కమ్మేయడంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇదే తరహాలో ఇటీవల నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 5న ముషీరాబాద్ గాంధీనగర్‌లోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. హాస్టల్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అదే రోజు బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్‌పేట్ వెళ్లే ప్రధాన రహదారిలోని లెనిన్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఫుడ్ కోర్ట్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినా, అప్పటికే ఫుడ్ కోర్ట్ పూర్తిగా దగ్ధమైంది.
ఫిబ్రవరి 3న బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–3లోని సదరన్ మిర్చి రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అంతకుముందు జనవరి 24న నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో నగరంలో అగ్నిసురక్ష చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
