సివరేజ్ పైప్లైన్ పనులు.. సికింద్రాబాద్లో ట్రాఫిక్ మళ్లింపులు
మల్కాజిగిరి:
సికింద్రాబాద్లో సివరేజ్ పైప్లైన్ ఏర్పాటు పనుల నేపథ్యంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. సికింద్రాబాద్లోని భారత్ పెట్రోలియం బంక్ నుంచి రైల్వే బ్రిడ్జ్ అండర్పాస్ వరకు వాటర్ బోర్డు సుమారు 419 మీటర్ల మేర సివరేజ్ పైప్లైన్ ఏర్పాటు పనులు చేపడుతోంది. ఈ పనుల కారణంగా గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
పంజాగుట్ట, బేగంపేట వైపు నుంచి వచ్చే వాహనాలను సెంట్ జాన్స్ రోటరీ వద్ద సంగీత్ జంక్షన్, అపోలో ఆసుపత్రి లేన్, చిలకలగూడ సర్కిల్, అలుగడ్డబావి, మెట్టుగూడ మార్గాల్లోకి మళ్లిస్తారు. అలాగే ఏవోసీ వైపు నుంచి వచ్చే వాహనాలు షెనోయ్ నర్సింగ్ హోమ్ జంక్షన్ వద్ద అడ్డగుట్ట, తుకారాం గేట్, లాల్లాగూడ మీదుగా మెట్టుగూడ వైపు వెళ్లాలని సూచించారు.
క్లాక్ టవర్, ఎస్డీ రోడ్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను సంగీత్ జంక్షన్ వద్ద అపోలో ఆసుపత్రి లేన్, చిలకలగూడ సర్కిల్ వైపు మళ్లించనున్నారు. రెజిమెంటల్ బజార్, డీ-మార్ట్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కూడా అపోలో ఆసుపత్రి లేన్, అలుగడ్డబావి మార్గం ద్వారా వెళ్లాలని అధికారులు తెలిపారు.
అదేవిధంగా సంగీత్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను తపస్య డిగ్రీ కాలేజీ సమీపంలో తుకారాం గేట్ మెయిన్ రోడ్, లాలాగూడ వైపు మళ్లించారు. కొన్ని వాహనాలను ఎన్సీఎల్ యూ-టర్న్ వద్ద వెనక్కి తిప్పి అపోలో ఆసుపత్రి లేన్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ డైవర్షన్లను గమనించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
