ఉస్మానియా–నిలోఫర్ హాస్పిటళ్ల స్టడీలో షాకింగ్ నిజాలు
హైదరాబాద్: క్లెబ్సియెల్లా, ఈ-కోలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు ఇప్పుడు అతి శక్తిమంతమైన యాంటీబయాటిక్‌లకూ లొంగకుండా మరింత మొండిగా మారుతున్నాయి. అన్ని మందులు ఫెయిల్ అయినప్పుడు డాక్టర్లు చివరి అస్త్రంగా ఉపయోగించే ‘లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్’ అయిన కొలిస్టిన్ కూడా పనిచేయని పరిస్థితి బయటపడింది.
ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్‌లలో నిర్వహించిన అధ్యయనంలో మొండి బ్యాక్టీరియా బారిన పడిన ప్రతి 10 మందిలో ఒకరికి (10.7%) కొలిస్టిన్ కూడా పనిచేయలేదన్న ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పెద్దల కంటే పిల్లల్లో ఈ ప్రమాదం దాదాపు రెట్టింపుగా ఉండటం డాక్టర్లను కలవరపెడుతోంది.
స్టడీ వివరాలు
ఉస్మానియా, యాదాద్రి, జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన మైక్రోబయాలజీ ప్రొఫెసర్లు
డా. మధురిమ, డా. ఉదయశ్రీ, డా. ఉజ్మా జబీన్, డా. జ్యోతిలక్ష్మి బృందం ఈ అధ్యయనం నిర్వహించింది.
ఈ పరిశోధన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లో తాజాగా ప్రచురితమైంది.
2023 జూన్ నుంచి 2024 మే వరకు ఏడాది కాలంలో
- ఉస్మానియా జనరల్ హాస్పిటల్
- నిలోఫర్ హాస్పిటల్
లలో చికిత్స పొందిన పీడియాట్రిక్, అడల్ట్ రోగుల నుంచి 6,728 శాంపిల్స్ (రక్తం, మూత్రం, గాయాల చీము) సేకరించారు.
625 సీరియస్ కేసులు – ఒక్క ఆశ కొలిస్టిన్
ఈ శాంపిల్స్‌లో
- పెనిసిలిన్
- కార్బపెనెమ్
లాంటి సాధారణ యాంటీబయాటిక్స్‌కూ లొంగని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ (MDR) బ్యాక్టీరియా ఉన్న 625 సీరియస్ కేసులు గుర్తించారు.
వీరి కోసం డాక్టర్లకు మిగిలిన ఏకైక ఆశ కొలిస్టిన్ మాత్రమే.
