Silver price today: పసిడితో వెండి పోటీ.. రికార్డు గరిష్ఠాలకు సిల్వర్
Silver price today | ఇంటర్నెట్ డెస్క్: సరిగ్గా ఏడాది క్రితం వెండి ధర కిలో తొలిసారి లక్ష రూపాయలు దాటితే వామ్మో! అనుకున్నారంతా. కానీ, ఇప్పుడు అదే వెండి పసిడికి ఏమాత్రం తక్కువ కానంటోంది. పట్టపగ్గాల్లేకుండా దూసుకెళుతోంది. దేశీయంగా కిలో వెండి రూ.1.84 లక్షల వద్ద సరికొత్త రికార్డు గరిష్ఠాలను నమోదు చేసింది. అటు పసిడి సైతం రూ.1.30 లక్షల పైనే పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరగడానికి తోడు, రూపాయి విలువ పతనం కావడమూ ఈ లోహాల ధరల పెరుగుదలకు కారణమని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో (MCX) గోల్డ్ ఫ్యూచర్స్‌లో 2026 ఫిబ్రవరి కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర రూ.1.30 లక్షలు పలుకుతోంది. అదే సమయంలో ఎంసీఎక్స్‌లో మార్చి డెలివరీ వెండి అత్యధికంగా రూ.3,126 పెరిగి రూ.1,84,727 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. బుధవారం డాలరుతో రూపాయి మారకం విలువ 90 మార్కు దాటింది. దీంతో దేశీయంగా వీటి ధరలు పెరిగాయి. దీనికితోడు యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుదలకు కారణమని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ ఔన్సు 4,204 వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు 57.90 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.1.32 లక్షలు పలుకుతుండగా.. కిలో వెండి రూ.1.83 లక్షలుగా ఉంది.
వెండికీ అందుకే అంత డిమాండ్
గతంలో దేవుళ్ల బొమ్మలు, పూజా సామగ్రి, సంపన్నుల ఇళ్లల్లో పళ్లాలు, గ్లాసులకు వెండిని దేశీయంగా వినియోగించేవారు. కొవిడ్ తర్వాత పరిస్థితులు మారాయి. పారిశ్రామికంగా వెండి వినియోగం పెరిగింది. సౌర విద్యుత్ రంగం, విద్యుత్ కార్లు, మొబైల్స్ తదితర రంగాల నుంచి దీనికి డిమాండ్ పెరిగింది. దీనికితోడు చిన్న మదుపరులు పెట్టుబడి కోసం వెండిని కొనడం ప్రారంభించారు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి బంగారంతో పాటు వెండికీ ఉందని చెబుతుండటంతో, మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు.
