సింగరేణి నిధులు కుటుంబ నియోజకవర్గాలకు తరలించారు.. చెన్నూరును విస్మరించారు: మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున శుక్రవారం ప్రచారం చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కలిసి సింగరేణి ప్రాంత ప్రజల కోసం ఖర్చు చేయాల్సిన డీఎంఎఫ్‌టీ నిధులను గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు తరలించి చెన్నూరు అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. సింగరేణి నిధులతో సిద్దిపేటలో భారీ స్టేడియం నిర్మించారని, దీనిపై క్యాతనపల్లి ప్రచారానికి వస్తున్న హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సింగరేణి బొగ్గు గనుల ప్రాంత ప్రజలు కాలుష్యం, ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, ఆ ప్రాంత అభివృద్ధికి వినియోగించాల్సిన డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను బీఆర్ఎస్ నేతలు తమ నియోజకవర్గాలకు మళ్లించారని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల కేటాయింపుకు కేంద్రం నిర్వహించిన వేలంలో సంస్థ పాల్గొనకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని, అందువల్ల కొత్త గనులు రాలేదన్నారు.
చెన్నూరు నియోజకవర్గంలో పదేండ్ల పాలనలో కేవలం 250 డబుల్ బెడ్రూం ఇండ్లు మాత్రమే నిర్మించారని, మిగిలిన ప్రజలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు రావాల్సిన రూ.33 కోట్ల పరిహారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.28 కోట్ల పరిహారం మంజూరు చేయించానని తెలిపారు.
క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద ఆర్వోబీకి పదేళ్లుగా కనెక్టింగ్ రోడ్ నిర్మించలేదని, ఆలస్యం వల్ల ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తిరిగి తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్వోబీని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే అమృత్ పథకం కింద రూ.100 కోట్లతో తాగునీటి పనులు చేపట్టామని, ఆరు నెలల్లో ఇంటింటికి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 85 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
