వందే భారత్ రైలులో పాము కలకలం… నిందితుడు అరెస్ట్
“పాము” అనే మాట వినగానే గుండెల్లో గుబులు మొదలవుతుంది. అలాంటి పామును రైలులో వదిలేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అదే జరిగింది Vande Bharat Express రైలులో.
ఘటన ఎలా జరిగింది?
గత ఏడాది డిసెంబర్ 27న ముంబై నుంచి సోలాపూర్‌కు వెళ్తున్న వందే భారత్ రైలు (నెం. 22225)లోని C-16 కోచ్ టాయిలెట్‌లో ఒక పాము కనిపించింది. ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఆ టాయిలెట్‌ను మూసివేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
రైలు సోలాపూర్ స్టేషన్‌కు చేరుకున్న వెంటనే సిబ్బంది పామును పట్టుకుని బయటకు తీశారు. ఎవరికి గాయాలు జరగకపోవడం ఊరటనిచ్చింది.
సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, ఓ వ్యక్తి టాయిలెట్‌లోకి వెళ్లి పామును వదిలి బయటకు వస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. సాంకేతిక ఆధారాల సాయంతో నాసిక్ జిల్లాకు చెందిన 37 ఏళ్ల జగన్ అర్జున్ భలేను ముంబ్రాలో అరెస్ట్ చేశారు.
కేసు నమోదు… రిమాండ్
నిందితుడిపై రైల్వే చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతను ఈ పని ఎందుకు చేశాడు? దాని వెనుక ఉద్దేశ్యం ఏమిటి? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రయాణికుల భద్రతే ప్రధానం
రైళ్లలో ఇలాంటి ప్రమాదకర చర్యలు చేయడం తీవ్రమైన నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
