జీహెచ్ఎంసీలో స్పెషల్ ఆఫీసర్ పాలన
మల్కాజిగిరి–సైబరాబాద్ కార్పొరేషన్లకు కొత్త సెటప్
హైదరాబాద్ సిటీ:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో మంగళవారం సాయంత్రం నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీకి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఆఫీసర్‌గా, మరో అధికారిని కమిషనర్‌గా నియమించనున్నారన్న చర్చ జరుగుతోంది.
అదే సమయంలో మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించి జీవో విడుదల చేసి, వీటికి కూడా ఇద్దరు కమిషనర్లు, ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లను నియమించే అవకాశముందని సమాచారం. మరోవైపు మూడు కార్పొరేషన్లకు ఒక్క స్పెషల్ ఆఫీసర్, ముగ్గురు కమిషనర్లు అనే ఫార్ములాను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్న ప్రచారం సాగుతోంది.
మూడు నెలల తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ ఎవరు?
ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కర్ణన్ కొనసాగుతున్నారు. ఆయన్నే స్పెషల్ ఆఫీసర్‌గా నియమించి, కమిషనర్‌గా వేరొకరిని నియమిస్తారా? లేక ఓ సీనియర్ ఐఏఎస్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించి కర్ణన్‌ను కమిషనర్‌గా కొనసాగిస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఇంకోవైపు కర్ణన్ బదిలీ కూడా ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.
సైబరాబాద్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్‌గా ఉన్న సృజన, మల్కాజిగిరి కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్‌గా కొనసాగుతున్న వినయ్ కృష్ణారెడ్డిలను కొత్త కమిషనర్లుగా నియమించే అవకాశముందని తెలుస్తోంది. ఈ రెండు కార్పొరేషన్లకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించనున్నట్లు సమాచారం.
ఆస్తులు–అప్పుల విభజనపై ప్రభుత్వ ఫోకస్
మూడు కార్పొరేషన్ల విభజన తర్వాత ఆస్తులు, అప్పుల పంపకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ అంశంపై ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ మొత్తం రూ.6,530 కోట్ల అప్పులు తీసుకుంది.
- ఎస్ఆర్‌డీపీ కోసం రూ.4,250 కోట్లు
- సీఆర్‌ఎంపీ కోసం 7.20% వడ్డీతో రూ.1,460 కోట్లు
- ఎస్ఎన్డీపీ కోసం 7.20% వడ్డీతో రూ.680 కోట్లు
- జేఎన్‌ఎన్‌యూఆర్ఎం ఇండ్లకు హడ్కో నుంచి రూ.140 కోట్లు
ఇందులో రూ.100 కోట్లు 8.90% వడ్డీతో, రూ.40 కోట్లు 9.90% వడ్డీతో తీసుకున్నారు. ఈ అప్పులకు ప్రతి నెలా రూ.100 కోట్ల చెల్లింపులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో పాటు అసలును కూడా చెల్లించడంతో ప్రస్తుతం అప్పులు రూ.4,876 కోట్లకు తగ్గాయి.
అప్పులతో పాటు జీహెచ్ఎంసీకి చెందిన 24 మార్కెట్లలోని 2,363 షాపులను మూడు కార్పొరేషన్లకు ఇబ్బందులు లేకుండా విభజించనున్నట్లు సమాచారం. కార్పొరేషన్ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
నేడు చివరి స్టాండింగ్ కమిటీ సమావేశం
జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు రేపటితో ముగియనుండటంతో సోమవారం చివరి స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 13 అజెండా అంశాలతో పాటు పలు టేబుల్ ఐటమ్స్‌ను ఆమోదించే అవకాశం ఉంది.
జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఆస్తి పన్ను, ఖాళీ భూమి పన్ను అధికారాలు అప్పగిస్తూ కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తారా లేదా అన్నది ఈ సమావేశంలో తేలనుంది. అలాగే అభివృద్ధి పనులు, ఆదాయ వనరుల పెంపు, క్రీడా సదుపాయాల ప్రైవేటు నిర్వహణ వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది.
