రాష్ట్ర అభివృద్ధి – ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు & భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, జనవరి 14, 2026:
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు & భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజుతో కలిసి మంత్రి శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో ప్రజలకు ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లను నివాస ప్రాంతాలకు దూరంగా మార్చేందుకు త్వరలో చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. అమృత్ పథకం కింద క్యాతనపల్లి మున్సిపాలిటీకి రూ.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఇప్పటివరకు సుమారు 50 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచి ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. గత పదేళ్లుగా అందని రేషన్ కార్డులను అర్హులైన పేదలకు గుర్తించి అందించామని, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే వచ్చే నెల నుంచి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నగరాభివృద్ధి నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులను కూడా ప్రజాప్రయోజనాల కోసం వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు.
అభివృద్ధి పనుల వివరాలు:
- 6వ వార్డు భగత్ సింగ్ నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద – రూ.87.58 లక్షలు (TUFIDC)
- 21వ వార్డు జెండా సమీపంలోని మెయిన్ రోడ్డులో – రూ.20 లక్షలు (నగరాభివృద్ధి నిధులు)
- 17వ వార్డు రాజీవ్ చౌక్ వద్ద – రూ.50 లక్షలు
- 20వ వార్డు శ్రీనివాస నగర్ – ప్రగతి నగర్ జంక్షన్ వద్ద – రూ.38 లక్షలు
(అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులు) - 3వ వార్డు ఇందిరా నగర్లో పోచమ్మ ఆలయం వద్ద – రూ.22.50 లక్షలు
- 10వ వార్డు రిటైర్మెంట్ కాలనీ బోర్డు వద్ద – రూ.1.24 కోట్లు
- 11వ వార్డు సబ్స్టేషన్ వెనుక – రూ.28.36 లక్షలు
- 15వ వార్డు అరుమల్ల పోచం రోడ్డులో – రూ.42.60 లక్షలు (TUFIDC)
- 18వ వార్డు ఠాగూర్ స్టేడియం పార్క్ వద్ద – రూ.15 లక్షలు
- 19వ వార్డు అబ్రహాం నగర్ బోర్డు వద్ద – రూ.15 లక్షలు (నగరాభివృద్ధి నిధులు)
అలాగే రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ప్రజల సౌకర్యార్థం రూ.57 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు.
చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తానని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
