ఉపాధి హామీలో అక్రమాలపై కఠిన చర్యలు.. మరో 314 మందికి సస్పెన్షన్
హైదరాబాద్:
ఉపాధి హామీ పథకంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. స్కీమ్ అమలులో జరిగిన అవకతవకలను గుర్తించి బాధ్యులైన సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించడం, అక్రమంగా తీసుకున్న నిధులను రికవరీ చేయడంలో రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఈ మేరకు గత పదేళ్లలో నిర్వహించిన సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో కొన్ని ప్రాంతాల్లో అక్రమాలు జరుగుతున్నప్పటికీ, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందని కేంద్రం పేర్కొంది.
ఇలా వెలుగులోకి వచ్చిన అక్రమాలు
క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకంలో నిధులు ఎలా దారి మళ్లించారనే విషయాలు సోషల్ ఆడిట్లో బయటపడ్డాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కొందరు అధికారులు కలిసి అవకతవకలకు పాల్పడినట్టు తేలింది. నిబంధనల ప్రకారం ఉపాధి పనులు కూలీలతో చేయించాల్సి ఉండగా, కొన్ని చోట్ల జేసీబీలు, ట్రాక్టర్లతో పనులు చేయించి మస్టర్ రోల్స్‌లో మాత్రం కూలీలు పనిచేసినట్టు నమోదు చేశారు.
అలాగే ఊర్లో లేని వ్యక్తులు, మరణించిన వారి పేర్లను జాబ్ కార్డుల నుంచి తొలగించకుండా వారి పేర్లపై డబ్బులు డ్రా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కందకాలు తవ్వడం, మట్టి పోయడం వంటి పనుల్లో తక్కువ పని చేసి ఎక్కువ కొలతలు నమోదు చేసి అదనపు బిల్లులు పొందినట్టు ఆడిట్లో వెల్లడైంది. గతంలో చేసిన పనులను మళ్లీ కొత్తగా చేసినట్టు చూపించి నిధులు స్వాహా చేసిన ఘటనలూ బయటపడ్డాయి.
రికవరీపై ప్రత్యేక దృష్టి
కేవలం సిబ్బందిని తొలగించడమే కాకుండా ప్రజాధనాన్ని తిరిగి రాబట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సోషల్ ఆడిట్ బృందాలు గ్రామాల వారీగా నిర్వహించిన ప్రజావేదికల్లో ఈ అక్రమాలను సాక్ష్యాధారాలతో బయటపెట్టడంతో వెంటనే చర్యలు చేపట్టారు. రాబోయే రోజుల్లో సోషల్ ఆడిట్ వ్యవస్థను మరింత పటిష్టం చేసి అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భారీగా చర్యలు
గత పదేళ్లలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంది. అవినీతికి పాల్పడినట్టు రుజువైన 346 మంది సిబ్బందిని ఇప్పటివరకు సర్వీసు నుంచి తొలగించారు. మరో 314 మందిని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా అక్రమాలకు బాధ్యులైన సుమారు 20 వేల మందికి జరిమానాలు విధించారు. ఇప్పటివరకు దుర్వినియోగమైన నిధుల్లో నుంచి రూ.5.96 కోట్లను రికవరీ చేశారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ స్థాయిలో సిబ్బందిపై చర్యలు తీసుకున్న ఉదాహరణలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది.
