భగ్గుమంటున్న వేసవి.. ఆరోగ్యంపై జాగ్రత్తలు తప్పనిసరి
వేసవి భానుడు రోజురోజుకు భగ్గుమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రంగా ఉండటంతో మధ్యాహ్నం అయ్యిందంటే ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. మొన్నటి వరకు చలికి వణికిపోయిన ప్రజలు ఇప్పుడు ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు.
అయితే వేసవి కాలం కేవలం వేడి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలను కూడా తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, చర్మవ్యాధులు, కలరా, విరేచనాలు, వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అతిసారం:
వేసవిలో ముఖ్యంగా పిల్లల్లో అతిసారం ఎక్కువగా కనిపిస్తుంది. ఎండల కారణంగా దాహం ఎక్కువగా వేయడంతో ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగుతారు. ఆ నీటిలో ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి అతిసారానికి కారణమవుతుంది. రోజులో మూడు సార్లకు పైగా నీళ్ల విరేచనాలు రావడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యను నివారించాలంటే బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్లాలి. ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగకుండా ఉండాలి. అలాగే ఎప్పుడూ శుభ్రమైన ఆహారమే తీసుకోవాలి.
వేడి జలుబు:
వేసవిలో రైనో, కరోనా, పారా ఇన్‌ఫ్లుయెంజా వంటి వైరస్‌లు కూడా వ్యాపిస్తాయి. ఇవి జలుబు, దగ్గు, తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. వేడి జలుబు వచ్చినప్పుడు గొంతు, ముక్కులో శ్లేష్మంలో మంటగా అనిపిస్తుంది. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్స్, ఏసీ గదుల్లో ఈ వైరస్‌లు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
స్విమ్మర్స్ ఇయర్ డిసీజ్:
ఎండ నుంచి ఉపశమనం కోసం చాలామంది స్విమ్మింగ్ చేస్తుంటారు లేదా తరచుగా షవర్ బాత్ తీసుకుంటుంటారు. కొందరు ఎక్కువసేపు నీటిలో ఉండటం వల్ల చెవుల్లో నీళ్లు నిలిచిపోతాయి. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనినే స్విమ్మర్స్ ఇయర్ డిసీజ్ అని అంటారు. ఈ సమస్యను నివారించాలంటే స్విమ్మింగ్ చేసిన తర్వాత కాటన్ టవల్ లేదా ఇయర్ బడ్స్‌తో చెవి లోపలి భాగాన్ని శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం, పరిశుభ్రత పాటించడం, శుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
