తెలంగాణకు నాలుగు వారాల్లోనే నూతన డీజీపీ సిఫారసు చేయాలి: యూపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ :
రానున్న నాలుగు వారాల్లో తెలంగాణ రాష్ట్రానికి నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని సిఫారసు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అర్హత కలిగిన ఐపీఎస్ అధికారుల జోన్ ఆఫ్ కన్సిడరేషన్ నుంచి, వారి పరస్పర ప్రతిభ (ఇంటర్–సే మెరిట్) ఆధారంగానే ఎంపిక జరగాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
పలు రాష్ట్రాల్లో ‘యాక్టింగ్ డీజీపీ’ల నియామకాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, ఈ విషయంలో రాష్ట్రాల ట్రాప్‌లో పడొద్దని యూపీఎస్సీకి స్పష్టమైన సూచనలు చేసింది.
‘‘వారికి డీజీపీ వద్దు… వారికి సరిపోయే యాక్టింగ్ లేదా అడ్‌హక్ డీజీపీలు కావాలి’’ అంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
యూపీఎస్సీ ఎస్ఎల్పీపై విచారణ
తెలంగాణ డీజీపీ ఎంపిక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ యూపీఎస్సీ గత నెల 29న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
యూపీఎస్సీ తరఫున సీనియర్ అడ్వకేట్ నరేశ్ కౌశిక్, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.
కౌశిక్ వాదనలు వినిపిస్తూ… ప్రకాశ్ సింగ్ కేసులో 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం డీజీపీ సిఫారసు కోసం రాష్ట్ర ప్రభుత్వం పేర్లను యూపీఎస్సీకి పంపాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే 2018 ఉత్తర్వుల ప్రకారం, ప్రస్తుత డీజీపీ పదవీ విరమణకు మూడు నెలల ముందే ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని గుర్తు చేశారు.
తెలంగాణ ఆలస్యం చేసిందా?
అయితే రాష్ట్రాలు తరచుగా ప్రతిపాదనలు ఆలస్యంగా పంపుతూ, మధ్యలో యాక్టింగ్ డీజీపీలను నియమిస్తున్నాయని కౌశిక్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా నూతన డీజీపీ ఎంపికకు సంబంధించిన మూడు నెలల తప్పనిసరి వ్యవధిని పాటించలేదని వాదించారు.
ఈ వాదనలపై జోక్యం చేసుకున్న సీజేఐ…
‘‘ఈ ఆదేశాలను ఉల్లంఘించిన తెలంగాణపై ఎందుకు ధిక్కార చర్యలు ప్రారంభించలేదు?’’ అని యూపీఎస్సీని ప్రశ్నించారు.
దీనికి కౌశిక్ 15 రోజుల గడువు కోరగా… భవిష్యత్‌లో ఇలాంటి ఉల్లంఘనలు జరిగితే ధిక్కార చర్యలు తీసుకునే పూర్తి హక్కు యూపీఎస్సీకి ఉంటుందని సీజేఐ స్పష్టం చేశారు.
యాక్టింగ్ డీజీపీలకు ఊతం ఇస్తున్న జాప్యం
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ యూపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరిస్తే ఏమయ్యేదని సీజేఐ ప్రశ్నించారు. ‘‘అలా జరిగి ఉంటే తెలంగాణకు క్రియాశీల డీజీపీ ఉండేవారు కాదు’’ అని వ్యాఖ్యానించారు.
కొత్త డీజీపీ నియామకంలో యూపీఎస్సీ వాదనలు సమంజసమే అయినా, తీవ్ర జాప్యం అడ్‌హక్ లేదా యాక్టింగ్ డీజీపీల నియామకానికి పరోక్షంగా ఊతం ఇస్తోంది అని ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల ఎంపానెల్‌మెంట్ కమిటీ మీటింగ్ (ECM)ను వీలైనంత త్వరగా నిర్వహించి, తెలంగాణకు నూతన డీజీపీని సిఫారసు చేయాలని యూపీఎస్సీకి ఆదేశించింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున శేషాద్రి నాయుడు జోక్యం చేసుకుని… 2025 ఏప్రిల్‌లోనే డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు యూపీఎస్సీకి పంపామని, కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కోర్టు స్పందిస్తూ… పరిశీలనలో ఉన్న అధికారుల అర్హతను నిర్ణయించేది యూపీఎస్సీయేనని స్పష్టం చేసింది.
కేసు బ్యాక్‌గ్రౌండ్
రాష్ట్ర డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి. ధన్‌గోపాల్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2025 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని ఆయన వాదించారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం…
నాలుగు వారాల్లో డీజీపీ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని యూపీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్‌ను పరిశీలించి, నిబంధనల ప్రకారం శాశ్వత డీజీపీ ఎంపికను పూర్తిచేయాలని, ఫిబ్రవరి 5లోపు నివేదిక సమర్పించాలని పేర్కొంది.
హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ యూపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా… తాజాగా సీజేఐ ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ముగించింది.
