Supriya Sule: ఇదే మెషిన్‌పై నాలుగుసార్లు గెలిచా: ఈవీఎంలపై సుప్రియా సూలే
ఇంటర్నెట్ డెస్క్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) పనితీరుపై ఎన్నికల సమయాల్లో ప్రతిపక్షాలు విమర్శలు చేయడాన్ని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే తప్పుబట్టారు (Supriya Sule Junks EVM Rigging Charge). మహారాష్ట్ర ఎన్నికల్లో భాజపా విజయానికి ఈవీఎంలు, వీవీప్యాట్‌లను అనుమానించలేనని అన్నారు. మహారాష్ట్రలోని బారామతి నుంచి తాను అదే మెషిన్‌పై నాలుగుసార్లు గెలిచానన్నారు. ఎన్నికల సంస్కరణలపై చర్య సందర్భంగా సుప్రియా సూలే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సంస్కరణల చర్చలో కాంగ్రెస్ (Congress) నేతలు మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు భాజపా ఎన్నికల కమిషన్‌ను వాడుకుంటోందని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లను నియమించే ఎంపిక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఎన్నికలకు ఒక నెల ముందు అన్ని పార్టీలకు మెషిన్-రీడబుల్ ఓటరు జాబితాను అందించాలని.. 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్‌ను ధ్వంసం చేయడానికి అనుమతించే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎం రిగ్గింగ్‌పై కాంగ్రెస్ లోక్‌సభలో ఆరోపణలు చేస్తుండగా.. దానికి మిత్రపక్షమైన ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
