Telangana Assembly Today: నేడు కృష్ణా జలాలపై అసెంబ్లీలో కీలక చర్చ..!!
Krishna Water Dispute: తెలంగాణ శాసనసభలో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన కృష్ణా నదీ జలాల అంశంపై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ జరగనుంది.
ఈ చర్చపై అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఆసక్తి నెలకొంది. కృష్ణా జలాల పంపకాల అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటి నుంచో సున్నితమైన అంశంగా ఉండటంతో, ఈ రోజు జరిగే చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ చర్చలో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా నదిపై తెలంగాణకు ఉన్న హక్కులు, గతంలో జరిగిన అన్యాయాలు, ప్రస్తుత నీటి వినియోగ పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలను ప్రజెంటేషన్ ద్వారా సభకు వివరించనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో జల వివాదాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సభ ముందుంచనున్నారు.
ఇదిలా ఉండగా, ఇవాళ శాసనసభలో ప్రభుత్వం నాలుగు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిలో ప్రధానంగా తెలంగాణ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్, పే స్ట్రక్చర్) సవరణ బిల్లు, అలాగే దీనికి సంబంధించిన రెండో సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, సిబ్బంది నిర్మాణం, వేతన విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అదేవిధంగా పంచాయతీ రాజ్ సవరణ బిల్లు మరియు దానికి సంబంధించిన రెండో సవరణ బిల్లును కూడా సభ ముందుకు తీసుకురానున్నారు. స్థానిక సంస్థల పరిపాలనను మరింత సమర్థవంతంగా చేయడమే లక్ష్యంగా ఈ సవరణలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి పరిపాలనలో అధికారాల పంపకం, పరిపాలనా సౌలభ్యం పెంచే దిశగా ఈ బిల్లులు ఉపయోగపడనున్నాయని ప్రభుత్వం చెబుతోంది.
కృష్ణా జలాలపై చర్చతో పాటు కీలక బిల్లుల ప్రవేశం నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉండటంతో, సభలో వాడివేడిగా చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
