Telangana News: ఓటెయ్యకపోతే నా డబ్బులు తిరిగివ్వండి ప్లీజ్
నార్కట్‌పల్లి: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ సర్పంచి అభ్యర్థి.. ఓటర్లకు పంచిన డబ్బులను తిరిగి వసూలు చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఔరవానిలో చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి మద్దతుతో సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి బాలరాజు.. ఓటర్లకు డబ్బులు పంచాడు. కానీ.. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జక్కల పరమేశ్ 450 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.
దీంతో బాలరాజు దేవుడి ఫొటో పట్టుకొని ‘‘మీరు నాకు ఓటు వేస్తే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. లేదంటే నేను మీకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి’’ అని విలపిస్తూ గ్రామంలో ఇంటింటికీ తిరిగాడు. చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ సందర్భంగా ఆయన భార్య మాట్లాడుతూ.. 50 లేదా 60 ఓట్ల తేడాతో ఓడిపోతే డబ్బులు అడగకపోయేవాళ్లమన్నారు. 450 ఓట్లతో ఓడిపోయినందుకు తిరిగి అడుగుతున్నామని ఓటర్లకు తెలియజేశారు.
