2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల తెలంగాణ లక్ష్యం – గనుల రంగం కీలకం: డా. వివేక్ వెంకటస్వామి
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని నిర్ధేశించారని, ఈ మహత్తర లక్ష్య సాధనలో గనుల రంగం కీలక పాత్ర పోషించనుందని కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి తెలిపారు.
ప్రస్తుతం జాతీయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ రాష్ట్ర వాటా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.
ఈ దిశగా తెలంగాణ గనుల శాఖ చేపడుతున్న పలు సంస్కరణల ఫలితంగా, ఇటీవలి కాలంలో గనుల ఆదాయం 22 శాతం మేర పెరిగిందని మంత్రి వెల్లడించారు.
శుక్రవారం గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ‘రాష్ట్రియ ఖనిజ చింతన్ శివిర్–2026’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల గనుల మంత్రులు, గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పారదర్శకత, స్థిరత్వానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి, రాష్ట్రంలో జీరో అక్రమ గనులు, జీరో అక్రమ రవాణా, జీరో ఓవర్‌లోడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. తాత్కాలికంగా కొన్ని ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనప్పటికీ, దీర్ఘకాలంలో ఈ సంస్కరణలు బలమైన, స్థిరమైన ఫలితాలను ఇస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇకపై ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్ విధానానికి స్వస్తి పలికి, ఇసుకతో పాటు చిన్న, పెద్ద ఖనిజాల కోసం వేలం విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీని ద్వారా సరైన ధర నిర్ణయం, పారదర్శకత, జవాబుదారీతనం మరింత మెరుగుపడతాయని వివరించారు.
అక్రమ గనుల తవ్వకం ఇప్పటికీ ప్రధాన సవాలుగానే ఉందని పేర్కొన్న డా. వివేక్ వెంకటస్వామి, దానిని అరికట్టేందుకు జీపీఎస్ ఆధారిత వాహనాల పర్యవేక్షణ, డ్రోన్ నిఘా, ఉపగ్రహ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఖనిజ రవాణా వాహనాల్లో ఓవర్‌లోడింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
గనుల రంగంలో అక్రమాలను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు, వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృత్రిమ మేధస్సు (AI) వినియోగంపై అధ్యయనం చేసి అమలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు.
“రాబోయే సంవత్సరాల్లో రాష్ట్ర బడ్జెట్‌కు గనుల శాఖ గణనీయమైన బలం చేకూర్చడమే మా లక్ష్యం,” అని ఆయన అన్నారు.
చింతన్ శివిర్‌ను నిర్వహించినందుకు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి డా. వివేక్ వెంకటస్వామి కృతజ్ఞతలు తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధిలో ఖనిజాల పాత్రపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో గనుల రంగాన్ని బలోపేతం చేయడం రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రయోజనకరమని స్పష్టం చేసిన మంత్రి, ఖనిజ ఆధారిత ఆర్థిక అభివృద్ధిలో భారత్ ముందంజలో నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.
