ఉమ్మడి వరంగల్‌లో ఐదు మున్సిపాలిటీల్లో ఉత్కంఠ… చైర్‌పర్సన్ పీఠాలపై ఎక్స్‌అఫీషియో, ఇండిపెండెంట్ల ప్రభావం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కీలక మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు, స్టేషన్ ఘన్‌పూర్, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో పీఠం ఖాయం చేసుకున్నప్పటికీ, మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, జనగామ, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో మాత్రం ఫలితం ఇంకా తేలలేదు. ఈ ఐదు చోట్ల ఎక్స్‌అఫీషియో సభ్యులు, స్వతంత్ర కౌన్సిలర్ల వైఖరి నిర్ణయాత్మకంగా మారింది.
మహబూబాబాద్‌లో కమ్యూనిస్టులే కీలకం
36 వార్డులున్న మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ లేకపోయినా, సీపీఎం మద్దతుతో బలం పెరిగింది. కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 11, సీపీఎం 3, సీపీఐ 3, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 5 స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పటికే సీపీఎం కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించగా, ఇండిపెండెంట్లలో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే సీపీఐ మాత్రం బీఆర్ఎస్ వైపు నిలిచే అవకాశం ఉంది.
ఇక్కడ ఎస్టీ జనరల్ కేటగిరీ కావడంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కుమార్తె బానోతు తేజశ్వీ పేరు చైర్‌పర్సన్ రేసులో వినిపిస్తోంది. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే మురళీ నాయక్ (కాంగ్రెస్), ఎమ్మెల్సీ రవీందర్ రావు (బీఆర్ఎస్) ఓటు వినియోగించుకోనున్నారు. దీంతో సమీకరణాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి.
కేసముద్రంలో సమసమీకరణ
కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరి 8 సీట్లు గెలుచుకున్నాయి. ఇక్కడ మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎక్స్‌అఫీషియో ఓటు కీలకం కానుంది. ఆయన ఓటు కాంగ్రెస్‌కు కలిస్తే పీఠం హస్తం పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది.
తొర్రూరులో ఎక్స్‌అఫీషియో ప్రభావం
తొర్రూరులో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలు గెలిచింది. అయితే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య ఇద్దరూ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేస్తే సమీకరణాలు మారే అవకాశముంది. ఇక్కడ ఇండిపెండెంట్ల నిర్ణయం కూడా కీలకం కానుంది.
జనగామలో ఒక్క ఓటే తేడా
జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్-సీపీఎం కలిపి 13, ఇండిపెండెంట్లు 4 గెలిచారు. చైర్‌పర్సన్ కావాలంటే 16 ఓట్లు అవసరం.
ఇండిపెండెంట్లలో భూష పర్వతాలు, మంజుల బీఆర్ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్స్‌అఫీషియోగా చేరడంతో బీఆర్ఎస్ 16కు చేరింది. కాంగ్రెస్‌కు ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఎక్స్‌అఫీషియోగా చేరడంతో బలం 15కు చేరింది.
ఇండిపెండెంట్ మారబోయిన పాండు ఎటు వైపు మొగ్గుచూపుతారన్నదే ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఆయన నిర్ణయమే చైర్‌పర్సన్ ఎన్నికను తేల్చనుంది.
వర్ధన్నపేటలో కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితి
వర్ధన్నపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 1 గెలిచారు. ఇండిపెండెంట్ కాంగ్రెస్‌లో చేరడంతో చెరి సమాన స్థితి ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎక్స్‌అఫీషియో ఓటు కాంగ్రెస్‌కు కలవడంతో ఇక్కడ చైర్‌పర్సన్ పీఠం కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
తుది తీర్పు త్వరలోనే
ఈ ఐదు మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫీషియో ఓట్లు, స్వతంత్ర కౌన్సిలర్ల వైఖరి చైర్‌పర్సన్ పీఠాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. సోమవారం జరిగే మున్సిపల్ సమావేశాలతో ఉమ్మడి వరంగల్ రాజకీయ సమీకరణాలపై స్పష్టత రానుంది.
