వాట్సాప్‌లోనే టెన్త్ హాల్‌టికెట్లు.. తొలిసారిగా క్యూఆర్ కోడ్ వ్యవస్థ
హైదరాబాద్: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈసారి పెద్ద సౌకర్యం కల్పించారు. హాల్‌టికెట్ల కోసం స్కూళ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా WhatsApp ద్వారా హాల్‌టికెట్లు పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది Board of Secondary Education Telangana.
రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది మొత్తం 11,674 పాఠశాలల నుంచి 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 2,67,954 మంది బాలురు, 2,60,285 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 5.17 లక్షల మంది ఉండగా, గతంలో ఫెయిలైన 10,512 మంది విద్యార్థులు కూడా పరీక్ష రాయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.
హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్
ఈసారి హాల్‌టికెట్‌పై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించారు. దీనిని స్కాన్ చేస్తే విద్యార్థి పరీక్షా కేంద్రం వివరాలు వెంటనే తెలుసుకునే వీలుంటుంది.
వివరాల్లో తప్పులుంటే సవరణ
విద్యార్థులు గురువారం నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్‌లో పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం వంటి వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే ఈ నెల 12 నుంచి 26 వరకు సవరించుకునే అవకాశం ఉంది. స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్ ఆధారంగా హెడ్‌మాస్టర్లు ఆన్‌లైన్‌లో సవరణలు చేయాల్సి ఉంటుంది.
వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్ ఇలా పొందాలి
- 8096958096 నంబర్‌కు WhatsAppలో “Hi” అని మెసేజ్ పంపాలి
- తరువాత “SSC Hall Ticket March 2026” అని టైప్ చేయాలి
- అడిగిన విధంగా విద్యార్థి వివరాలు నమోదు చేయాలి
- వివరాలు సరిపోతే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం వస్తుంది
పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 040-23230942 కంట్రోల్ రూమ్ నంబర్‌కు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు.
