TG News: కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్ బస్సు.. 40 మంది విద్యార్థులకు గాయాలు
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశ్పాడు వద్ద స్కూల్ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. వేంసూరు మండలం మొద్దులగూడెంలోని వివేకానందా విద్యాలయం నుంచి సుమారు వంద మంది విద్యార్థులతో గణేశ్పాడు, ఎల్ఎస్ బంజరు, కేఎం బంజరు, మర్లకుంట, ముత్తగూడెం తదితర గ్రామాలకు బయలుదేరింది. గణేశ్పాడు గ్రామ శివారులోకి రాగానే.. డ్రైవర్ బస్సును వేగంగా నడపడంతో అదుపుతప్పి కాల్వలోకి పల్టీ కొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 40మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను విద్యార్థుల తల్లిదండ్రులు, వీఎం బంజరు పోలీసులు.. పెనుబల్లి, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు.
