రాష్ట్రపతి వెంటే నడిచే ఆర్మీ ఆఫీసర్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్
హైదరాబాద్:
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక ఆర్మీ ఆఫీసర్ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ అధికారి ఎవరో కాదు.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి సహాయకుడిగా (ADC – Aide-de-Camp) పనిచేస్తున్న మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్. తన స్టైలిష్ లుక్, క్రమశిక్షణ, వినయంతో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నారు.
రాష్ట్రపతి ఏ కార్యక్రమానికి హాజరైనా ఆమె వెంటే ఉంటూ, వర్షం పడితే గొడుగు పట్టడం, అవసరమైన సమయంలో సాయం చేయడంలో మేజర్ రిషబ్ చూపించే విధానం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు పొందుతోంది. ఆయన లుక్ పాతకాలపు సినిమాల్లో హీరోల మాదిరిగా ఉందని, యూనిఫాంలో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ “ఈ ఆఫీసర్‌ను చూస్తుంటే నాకు కూడా రాష్ట్రపతి కావాలనిపిస్తోంది” అంటూ చేసిన కామెంట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ కేవలం స్టైలిష్ ఆఫీసర్ మాత్రమే కాదు.. ఆయన ఇండియన్ ఆర్మీలో అత్యంత కఠినమైన ‘4 పారా స్పెషల్ ఫోర్స్’లో పనిచేసిన వీరుడు. అసాధారణమైన శారీరక, మానసిక దృఢత్వానికి ప్రతీకగా నిలిచే ప్రతిష్టాత్మక ‘బలిదాన్ బ్యాడ్జ్’ను కూడా ఆయన అందుకున్నారు. 2021 రిపబ్లిక్ డే పరేడ్‌లో తన యూనిట్‌కు నాయకత్వం వహించి ‘బెస్ట్ మార్చింగ్’ ట్రోఫీని గెలుచుకున్నారు. 2026 వేడుకల్లో కూడా రాష్ట్రపతి వెంటే ఉండి అందరి దృష్టిని ఆకర్షించారు.
సోషల్ మీడియాలో “ఆయన ముఖంలో నిజాయితీ కనిపిస్తోంది”, “రాష్ట్రపతిని ఒక కొడుకులా చూసుకుంటున్నారు”, “ఆమె నిజంగా అదృష్టవంతురాలు” అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దేశానికి సేవ చేసే సైనికుడిగా, అదే సమయంలో సున్నితమైన మానవీయతను చూపించే వ్యక్తిగా మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ ఇప్పుడు సోషల్ మీడియా స్టార్‌గా మారారు.
