కిచెన్‌నే తొలి ల్యాబ్.. స్త్రీలే తొలి శాస్త్రవేత్తలు!
భారతదేశ మౌలిక సైన్స్ చరిత్రను మరిచిపోయిన ఆధునిక చదువు
హైదరాబాద్ :
భారతదేశం ఆధునిక సైన్స్‌లో వెనుకబడి ఉందన్నది కఠినమైన నిజం. పెన్ను నుంచి సెల్‌ఫోన్ వరకు, విమానం నుంచి మెడికల్ పరికరాల వరకు—మన అవసరాలన్నీ ఇప్పటికీ యూరప్, అమెరికా దేశాలపై ఆధారపడి దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందుకు కారణంగా విద్యపై కుల కట్టుబాట్లు, శతాబ్దాల పాటు దేశం విదేశీ పాలనలో ఉండటం వంటి అంశాలను చరిత్ర చెబుతుంది.
అయితే, సైన్స్‌కు మనం ఇచ్చుకున్న నిర్వచనమే తప్పుదారి పట్టించిందన్న ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తోంది. సైన్స్ అంటే కేవలం యంత్రాలు, ల్యాబ్‌లు, కోట్స్ వేసుకున్న శాస్త్రవేత్తలేనా? అలా కాకుండా జీవనాన్ని నడిపించిన జ్ఞాన ప్రక్రియగా చూస్తే—భారతదేశంలో మౌలిక సైన్స్ చరిత్ర అత్యంత ప్రాచీనమైనదిగా కనిపిస్తుంది. కానీ ఆ సైన్స్, ఆ ప్రయోగశాలల గురించి ఇప్పటివరకు ఎవరూ రాయలేదు. చర్చే జరగలేదు. దీనికి కులబందీ విద్యతో పాటు పురుషాధిపత్య దృష్టికోణం కూడా ప్రధాన కారణంగా మారింది.
వంటగది నుంచే సైన్స్ ఆరంభం
మానవ నాగరికతలో అత్యంత కీలకమైన అంశం ఆహారం. సహజంగా దొరికిన ఆహారాన్ని వంటగా మార్చిన క్షణమే తొలి సైన్స్ ప్రయోగం మొదలైంది. ఆసియా ఖండంలో, ముఖ్యంగా హరప్పా నాగరికత నాటి వ్యవసాయ ఆధారాలు—భారతదేశంలో మానవ జీవనం యూరప్, అమెరికాల కంటే ఎంతో ముందే అభివృద్ధి చెందిందని స్పష్టం చేస్తున్నాయి.
వేటాడి తెచ్చిన మాంసాన్ని కాల్చి తినడం ఒక దశ. కానీ అది సంపూర్ణ పోషకాహారం కాదు. ప్రోటీన్లు, విటమిన్లు యాదృచ్ఛికంగా మాత్రమే లభించేవి. ధాన్యాల పంటను శాస్త్రీయంగా ఎంపిక చేసి, విషంకాని గింజలను సాగు చేయడం మొదలైన తర్వాతే వంటకు, పంటకు గట్టి అనుసంధానం ఏర్పడింది. ఈ దశ నుంచే వంటగది ఒక ప్రయోగశాలగా మారింది.
పంట సైన్స్‌ను కనిపెట్టింది స్త్రీలే
భూమిలో నాటిన గింజ తనలాంటి మరిన్ని గింజలను పండిస్తుందన్న సత్యాన్ని మొదట గుర్తించినవారు స్త్రీలేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే జీవం ఎలా ఎదుగుతుందో, గర్భంలో శిశువు ఎలా రూపుదిద్దుకుంటాడో అనుభవపూర్వకంగా తెలిసినవారు స్త్రీలే. ఆ అనుభవమే పంట ప్రక్రియను అర్థం చేసుకునే శక్తిని ఇచ్చింది.
ధాన్యాన్ని కాల్చి తినలేం. ఉడికించాలి. ఎంత వేడి, ఎంత సమయం, ఏ పదార్థంతో కలపాలి అన్నది ప్రయోగం ద్వారానే తెలిసింది. ఇదే కిచెన్ సైన్స్ ప్రారంభం. నగరాలు, గ్రామాలు ఏర్పడకముందే వంట ప్రక్రియ లేకపోతే మానవ సమాజం నిలబడేది కాదు. పంట–వంట–జంట జీవనం—ఈ మూడు ఒకదానికొకటి విడదీయరాని సంబంధంతోనే అభివృద్ధి చెందాయి.
మత సంస్థల పాత్ర ఎంత?
పురుషులతో మాత్రమే ఏర్పడిన మత సంస్థలు—బౌద్ధ విహారాలు, క్రైస్తవ మిషనరీలు, హిందూ సన్యాసి సంఘాలు—సామాజిక మానసిక సమస్యలకు పరిష్కారాలు చూపినప్పటికీ, పంట సైన్స్‌కు గానీ, వంట సైన్స్‌కు గానీ గణనీయమైన కంట్రిబ్యూషన్ చేసిన దాఖలాలు లేవన్న విమర్శ ఉంది. వ్యవసాయ జంట కనిపెట్టిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని మాత్రమే అవి కొనసాగాయని రచయితలు పేర్కొంటున్నారు.
కిచెన్ ల్యాబ్‌లోని అసలైన సైన్స్
గ్రామీణ వంటగదిని పరిశీలిస్తే అది ఒక పూర్తి స్థాయి ప్రయోగశాలే. చేపలకూర వండేటప్పుడు చింతపండు, అల్లం, ఉల్లి, ధనియాలు, కరివేపాకు, నూనె—ఇవన్నీ కలిసి ఎలా పోషక విలువలు పెంచుతాయో స్త్రీలు అనుభవంతో తెలుసుకున్నారు. ఇదే విధంగా మటన్, కూరగాయల వంటకాలు కూడా పాజిటివ్ ఫుడ్ కెమికల్స్ కలయికతో తయారయ్యాయి.
పూర్వకాల గ్రామాల్లో మట్టి పొయ్యి పక్కనే నీటికుండ కాగుతూ ఉండేది. అన్నం, కూర వండుతూనే స్నానాల కోసం నీళ్లు వేడెక్కేవి. ఇది ఫ్యూయల్ సేవింగ్ హోం సైన్స్‌కు అద్భుత ఉదాహరణ. ముందురోజు గంజిని పులియబెట్టి మరుసటి రోజు వంటలో ఉపయోగించడం—పాజిటివ్ బ్యాక్టీరియా, జీర్ణక్రియపై అవగాహనకు నిదర్శనం.
చరిత్రలో చోటు దక్కని స్త్రీల జ్ఞానం
సంస్కృత గ్రంథాల్లో వంట సైన్స్, పంట సైన్స్ పురుషుల ఖాతాలో వేసినప్పటికీ—నిజ జీవితంలో ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసినది స్త్రీలేనన్న వాదన బలంగా ఉంది. కానీ ఆ జ్ఞానం పుస్తకాల్లోకి రాలేదు. కిచెన్ ల్యాబ్‌లో జరిగిన ప్రయోగాలు, వాటి వల్ల జీవన ప్రమాణాలు ఎలా మెరుగయ్యాయన్న అంశాలపై సరైన రచనలు లేవు.
భారతదేశానికి గొప్ప చరిత్ర ఉందన్నది నిజమే. కానీ ఆ చరిత్రలోని స్త్రీల సైన్స్, వంటగది ల్యాబ్‌ల కథలు ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. ఇది ఒక పెద్ద అన్యాయం.
