ఏఐ విప్లవం వేగం.. నాణ్యతకు మనిషి అవసరం
40% పని అదే చేస్తోంది
మానవ పర్యవేక్షణ తప్పనిసరి
టెక్ రంగంపై నాస్కామ్-ఇండీడ్ నివేదిక

ఈనాడు, బిజినెస్‌బ్యూరో: సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుతం టెక్ సంస్థల్లో దాదాపు 40% పనులు ఏఐ నిర్వహిస్తున్నట్లు పరిశ్రమ సంఘం నాస్కామ్, ఇండీడ్ సంయుక్తంగా నిర్వహించిన ‘వర్క్ రీ-ఇమాజిన్డ్- ది రైస్ ఆఫ్ హ్యూమన్-ఏఐ కొలాబరేషన్’ సర్వే తెలిపింది. 2027 నాటికి నిపుణులు, ఏఐ కలిసి పనిచేసే వాతావరణాన్ని 97% మంది మానవ వనరుల విభాగాధిపతులు ఊహిస్తున్నారు. ఆటోమేషన్ పెరుగుతున్నా, నాణ్యత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని ఈ నివేదిక స్పష్టం చేసింది.
ఏఐ ఒకప్పుడు బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాలకే పరిమితం అయ్యేది. ఇప్పుడు టెక్ సంస్థల్లో ఒక సహోద్యోగిగా మారిపోయింది అని నివేదిక పేర్కొంది. వివిధ విభాగాల్లో 20-40% పనులను ఏఐ నిర్వహిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఏఐని కేవలం సహాయం చేసేదిగా కాకుండా, రోజువారీ నిర్ణయాల్లో భాగంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏఐతో కలిసి పనిచేసేలా ఉద్యోగులను సిద్ధం చేయడమే ప్రత్యామ్నాయమని నాస్కామ్ పరిశోధనా విభాగం అధిపతి కేతకీ కర్ణిక్ పేర్కొన్నారు.
నాణ్యతపై ఆందోళన
యాంత్రికీకరణ వేగంగా విస్తరిస్తున్నప్పుటికీ, ఏఐ ఇచ్చే ఫలితాల నాణ్యతపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో, సగంకంటే ఎక్కువ మంది ఏఐ రూపొందించిన పనుల్లో అసంపూర్ణత లేదా తక్కువ నాణ్యత ఉన్నట్లు గుర్తించారు. ఏఐ చేసే పనుల్లో కచ్చితత్వం, సమగ్రత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని నివేదిక తేల్చింది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో 45 శాతం పనులు ఏఐ ద్వారా జరుగుతుండగా, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ వంటివి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
నైపుణ్యాల తీరు మారుతోంది
‘కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాల సంఖ్య తగ్గుతోంది’ అనేకంటే.. ఉద్యోగుల నుంచి సంస్థలు ఆశిస్తున్న పనితీరు మారుతోంది అని చెప్పొచ్చని ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశి కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సంస్థలు, ఉద్యోగాల్లోకి వస్తున్నవారూ ఏఐతో కలిసి పనిచేసే వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంటుందన్నారు. నియామక ప్రక్రియలోనూ మార్పులు వస్తున్నాయి. హైరింగ్ మేనేజర్లలో 85% మంది నైపుణ్యం ఆధారిత నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బహుళ నైపుణ్యాలున్న అభ్యర్థుల కోసం చూస్తున్నారు.
ఏజెంట్లతో సవాళ్లు
టెక్ రంగంలో ఏఐ ఏజెంట్లను విరివిగా వాడుతున్నారు. దాదాపు 95% సంస్థలు ఇప్పుడు వీటిని ఏదో ఒక రకంగా వినియోగిస్తున్నాయని, ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. డేటా ఆధారిత పనుల్లో ఇవి మనుషుల కంటే మెరుగ్గా పనిచేస్తాయని 65% మంది నమ్ముతున్నారు. అయితే కొన్ని చిక్కు సమస్యలూ ఉన్నాయి. 77% మంది భద్రత, గోప్యత అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత సాఫ్ట్‌వేర్ వ్యవస్థలతో ఏఐని అనుసంధానించడం, నైతిక విలువలు, మార్పు వల్ల ఉద్యోగుల ప్రతిఘటనల వంటి సవాళ్లు వస్తున్నాయని నివేదిక తెలిపింది. ఏఐతో కలిసి పనిచేసేందుకు ఉద్యోగుల సంసిద్ధతపై 40% పైగా హెచ్‌ఆర్ అధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని నివేదిక పేర్కొంది.
