కేసీఆర్ కుటుంబంలో రాజకీయ గొడవ కాదు.. ఆస్తుల పంచాయతీనే నడుస్తోంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, క్యాతనపల్లి:
రాష్ట్రాన్ని దోచుకున్న సంపాదనలో వాటాల కోసం కేటీఆర్, కవిత మధ్య పంచాయతీ నడుస్తోందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ విభేదం కాదని, కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంపకాల గొడవేనని ఆయన ఆరోపించారు. ఆస్తుల్లో మహిళా కోటగా కవిత వాటా అడుగుతోందని ఎద్దేవా చేశారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి వివేక్, 6, 7, 8, 10 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మున్సిపాలిటీలు, వార్డులు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, తాను ప్రతిరోజూ మార్నింగ్ వాక్‌లో ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నానని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్ ఒక్కసారైనా వార్డుల్లో పర్యటించాడా అని ప్రశ్నించారు. కేసీఆర్ చిన్న కొడుకునని చెప్పుకుంటూ చెన్నూరు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అక్రమ భూ దందాలు, ఇసుక మాఫియాను పెంచి పోషించి వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపించారు. కమీషన్లు వచ్చే చోట్లే రోడ్లు, డ్రైనేజీల పనులు జరిగాయని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
చెన్నూరు నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క నిరుపేద కుటుంబానికైనా డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అమరవాది గ్రామంలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. విశాఖ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. తమ కుటుంబం ఎప్పుడూ ప్రజాసేవకే అంకితమైందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
