కేసీఆర్ కుటుంబంలో రాజకీయ పోరు కాదు.. దోచుకున్న ఆస్తుల పంచాయతీ మాత్రమే: మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల / క్యాతనపల్లి:
కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్నది రాజకీయ విభేదాలు కాదని, రాష్ట్రాన్ని దోచుకున్న సంపాదనపై ఆస్తుల పంచాయతీ, వాటాల గొడవ మాత్రమేనని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనులు & భూగర్భ శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6, 7, 8, 10 వార్డుల్లో మంత్రి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, మున్సిపాలిటీ వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ..
“నేను ప్రతిరోజూ మార్నింగ్ వాక్‌లో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నాను. తెలిసిన సమస్యలను వెంటనే పరిష్కరించే బాధ్యతతో పనిచేస్తున్నాను. కానీ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్ ఒక్కసారి కూడా వార్డుల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగిన దాఖలాలు లేవు” అని విమర్శించారు.
కేసీఆర్ చిన్నకొడుకునని చెప్పుకుంటూ బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. “ఎప్పుడూ కేసీఆర్ ఇంట్లోనే ఉండేవారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి అక్రమ భూదందాలు, ఇసుక మాఫియాను పెంచి పోషిస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదించారు. కమిషన్లు వచ్చే చోటే రోడ్లు, డ్రైనేజీ పనులు జరిగాయి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మౌలిక వసతుల అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఒక్క నిరుపేద కుటుంబానికీ ఇవ్వలేదని విమర్శించారు.
కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ,
“ఇది రాజకీయ గొడవ కాదు. కవిత, హరీష్ రావు, కేటీఆర్ మధ్య ఆస్తుల పంచాయతీ నడుస్తోంది. రాష్ట్రాన్ని దోచుకున్న సంపాదనలో అన్నాచెల్లెళ్ల మధ్య వాటాల గొడవే ఇది. మహిళా కోట పేరుతో ఆస్తుల్లో వాటా అడుగుతున్నారు” అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను ఎమ్మెల్యేగా లేకపోయినా రూ.2 కోట్లు 50 లక్షలతో అమరవాది గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని, విశాఖ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. కాకా కుటుంబం ఎప్పటికీ ప్రజాసేవకే అంకితమని స్పష్టం చేశారు.
రాబోయే నెల నుంచే అర్హులైన వారందరికీ పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చిన మంత్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
