వన్యప్రాణులను ఇలా లెక్కిస్తారు!..జనవరి 19 నుంచి 25 వరకు రెండు విడతలుగా సర్వే
- ప్రస్తుత ఏడాదికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో గణన
- ఈసారి సర్వేలో సాధారణ ప్రజలు కూడా పాల్గొనే చాన్స్
- 3,500 మంది వలంటీర్స్ ను తీసుకున్న అటవీ శాఖ
- సేకరించిన డేటా ప్రత్యేక యాప్ లో అప్ లోడ్
అమ్రాబాద్ : అడవిలో వన్యప్రాణుల సర్వేకు వేళైంది. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, కృష్ణ జింకలు, మనుబోతులు, నక్కలు, అడవి కుక్కలు, అడవి పందులు వంటివి లెక్కిస్తారు. ప్రతి నాలుగేండ్లకోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అటవీశాఖ ఆధ్యర్యంలో ‘ ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్’ పేరుతో మాంసాహార, శాఖాహార జంతువుల గణనను చేస్తుంది.
2025 –-26 సంవత్సరానికి తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో సర్వే షురూ కానుంది. ఈనెల 19న ప్రారంభించి ఆరు రోజుల పాటు రెండు విడతలుగా వణ్యప్రాణి గణన చేస్తామని డీఎఫ్ఓ రేవంత్ చంద్ర పేర్కొన్నారు.
సాధారణ ప్రజలే వలంటీర్లు..
అడవి జంతువులను లెక్కించడం సాహసంతో కూడినది. అవి నివసించే ప్రదేశాలకు వెళ్లాలి. కదలికలు, అవశేషాలు, పాదముద్రలు, మలమూత్రాలు, వెంట్రుకలు సేకరించాలి. ఇవి వన్యప్రాణి శిక్షణ పొందిన నిపుణులు మాత్రమే చేయగలరు. ప్రస్తుత సర్వేలో సాధారణ ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనేందుకు అటవీశాఖ అవకాశం కల్పించింది. ఇందుకు గత నవంబర్ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్ తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల మంది రిజిస్ట్రర్ చేసుకోగా.. వీరిలో జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో అర్హులైన 3,500 మందిని వలంటీర్స్ గా ఎంపిక చేశారు. అమ్రా బాద్ టైగర్ రిజర్వ్ కు సుమారు 160 మందిని కేటాయించారు. వీరికి ఈనెల19న మన్ననూరు వనమాలిక వద్ద శిక్షణ ఇస్తారు. మరుసటి రోజు నుంచి 3 రోజుల పాటు పులుల లెక్కింపు, అనంతరం మరో 3 రోజులు శాఖాహార జంతువులను గణన చేస్తారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 2,611 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో కోర్ ఏరియా 2,166.37 చ.కి.మీ. బఫర్ ఏరియా 445.02 చ.కి.మీ గా ఉంది. కాగా మొత్తం 214 బీట్ లుగా ఏరియాను ఫారెస్ట్ అధికారులు విభజించారు. మనుషులు వెళ్లడానికి వీలయ్యే 191 బీట్ లలో ఇద్దరు(వలంటీర్, ఫారెస్ట్ సిబ్బంది) చొప్పున, తొలి మూడు రోజులు టైగర్స్, ఇతర మాంసాహార జంతువుల సర్వే నిర్వహిస్తారు.
ప్రత్యేక మొబైల్ యాప్ లో డేటా నమోదు
జంతు గణనకు రాష్ట్ర ప్రభుత్వం మోడ్రన్ టెక్నాలజీతో యాప్ రూపొందించింది. సేకరించిన డేటాను ప్రత్యేక మొబైల్ యాప్ లో ఎప్పటికప్పుడు ఫొటోలతో సహా అప్ లోడ్ చేస్తారు. ‘మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ -ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకోలాజికల్ స్టేటస్’ (ఎం-ఎస్‌టీఆర్‌ఎల్‌పీఈఎస్) యాప్ లో జియో ట్యాగింగ్ సౌలభ్యం ఉంది. సర్వేను రేంజర్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. కాలి నడకన రోజుకు 5 నుంచి 10 కి.మీ ప్రయాణిస్తారు.
ఎదురుపడే జంతువులు, అవశేషాలు, పాదముద్రలు, మల విసర్జన పదార్థాలు, చెట్లపై కాలిగోర్ల గుర్తులు, వెంట్రుకలు వంటివి సేకరించి యాప్ లో అప్ లోడ్ చేస్తారు. యాప్ లో నమోదు చేసిన వివరాల్లో ఏ అవశేషం ఏ జంతువుది, ఆహార శైలి, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను జాతీయ వన్యప్రాణి సంస్థ లెక్కలు వేసి జంతు గణన పూర్తి చేసిన అనంతరం అధికారికంగా ప్రకటిస్తుంది.
గతేడాది లెక్కింపులో..
గతేడాది ( 2024 -– 25) గణన ఆధారంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో 36 పెద్ద పులులు, 2 పులి కూనలు, ఉన్నట్టు తేలింది. ఇందులో 13 మగ పులులు కాగా 20 ఆడ పులులు, 3 లింగ నిర్ధారణ కాని పులులు ఉన్నట్లు లెక్క తేలింది. వందల సంఖ్యలో చిరుతలు, ఎలుగుబంట్లు, వేల సంఖ్యలో శాఖాహార జంతువులు ఉన్నట్లు అంచనా వేశారు. ఇప్పుడు వీటి సంఖ్య మరింత పెరిగే చాన్స్ ఉంటుందని ఫారెస్ట్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
వన్యప్రాణుల వృద్ధికి సర్వేనే కీలకం
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ప్రస్తుత జంతువుల వివరాలు, ఆహార శైలి, ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసేందుకు సర్వే అత్యంత కీలకంగా మారనుంది. దీని ఆధారంగా వన్యప్రాణుల రక్షణ, అభివృద్ధికి కావలసిన చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈసారి సర్వేలో వలంటీర్లుగా స్టూడెంట్స్, పర్యావరణ, జంతు ప్రేమికులు పాల్గొంటారు. వీరి ద్వారా అడవి రక్షణ, వన్యప్రాణుల ప్రాముఖ్యత బయటి ప్రపంచానికి తెలిసేందుకు చాన్స్ ఉంది. – డీఎఫ్ వో రేవంత్ చంద్ర
ట్రాప్ కెమెరాలతో గణన..
వలంటీర్లు, ఫారెస్ట్ సిబ్బందితో పాటుగా ట్రాప్ కెమెరాలతో కూడా సర్వే చేస్తారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో అమ్రాబాద్, మద్దిమడుగు, దోమలపెంట, మన్ననూర్ 4 రేంజ్ లను 4 బ్లాకులుగా విభజించారు. 1,150 లొకేషన్లలో సుమారు 2 వేల ట్రాప్ కెమెరాలు ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో బిగిస్తారు. వీటి ద్వారా జంతువుల కదలికలను గుర్తించి టెక్నికల్ సాయంతో గణన చేస్తారు. ముఖ్యంగా పెద్ద పులులపై చారల ఆధారంగా ఎన్ని ఉన్నాయనేది లెక్కిస్తారు. ప్రతి పులికి చారలు వేర్వేరుగా ఉంటాయి. వీటి ఆధారంగా పులులను లెక్కిస్తారు
