సంపూర్ణ చంద్రగ్రహణం: యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి ఆలయం మూసివేత
యాదాద్రి: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని ఆలయ అధికారులు, అర్చకులు మంగళవారం (మార్చి 3) మూసివేశారు. ప్రధానాలయంతో పాటు ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలన్నీ కూడా తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించారు.
ఇవాళ మధ్యాహ్నం 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు దేవాలయాలు కూడా మూతపడ్డాయి. గ్రహణ సమయంలో ఆగమ శాస్త్రాల ప్రకారం దేవాలయాలను మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతున్నట్టు అర్చకులు తెలిపారు.
ఆలయం రేపు (మార్చి 4) తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు తిరిగి తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం గ్రహణ దోష పరిహారార్థం సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సంప్రోక్షణ అనంతరం నిత్యపూజలు చేసి భక్తులకు దర్శనాలు అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
